రాజకీయాలలో వారసత్వం అన్నది ఒక అపోహ అవుతుందా?వాస్తవం అవుతుందా?ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది అపోహ అని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంత అన్నది చర్చనీయాశం అవుతుంది. జనరల్ గానే అనేక విషయాలలో చంద్రబాబు చెప్పేవి హిపోక్రసీగా కనిపిస్తాయన్న భావన రాజకీయ వర్గాలలో ఉంటుంది. అదే కోవలో ఈ వ్యాఖ్య ఉందా అన్న అభిప్రాయం వస్తుంది. కొద్ది రోజుల క్రితం ద ప్రింట్ అనే మీడియా ఛీఫ్ ఎడిటర్ శేఖర్ గుప్తాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తన రాజకీయ వారసుడుగా ఎదుగుతున్నారని భావిస్తున్నారా? అని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఇందుకు బదులు ఇస్తూ రాజకీయాలలో, వ్యాపారాలలో వారసత్వం అన్నది అపోహ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వాటిలో ఎవరికివారు పేరు, ప్రతిష్ట, సమర్థత సంపాదించుకోవాలని, అలాంటివాళ్లే నిలదొక్కుకుంటారని ఆయన పేర్కొన్నారు. స్వయంశక్తి ఎవరికైనా అవసరమే. కాదనం, కాని ఎక్కువ సందర్భాలలో అది వ్యాపారం అయినా, రాజకీయం అయినా వారసులకే అదిక అవకాశాలు లభిస్తాయన్నది వాస్తవం. కాకపోతే ఆ నిజాన్ని చంద్రబాబు డైరెక్టుగా చెప్పరు. లోకేష్ తన వారసుడుగా కనిపించవచ్చని, అయితే తన సమర్థతను రుజువు చేసుకుంటే ఎదుగుతారని చెప్పి ఉంటే సరైన జవాబు అయి ఉండేది. డొంక తిరుగుడుగా మాట్లాడడంలో దిట్ట అయిన చంద్రబాబు అదే తరహాలో ఆన్సర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు 1978 లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి గాను ఆయన ఎన్ని తంటాలు పడింది గుర్తు లేకుండా పోతుందా? అప్పట్లో కాంగ్రెస్ ప్రముఖులుగా ఉన్న నేతలు రాజగోపాలనాయుడు, ఎన్జీ రంగా వంటివారి ఆశిస్సుల కోసం ప్రయత్నించి సఫలం అయ్యారు. అప్పట్లో ఏపీలో ఇందిరాగాందీ వేవ్ ఉండడంతో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అంజయ్య క్యాబినెట్ లో మంత్రి కావడానికి ఎవరెవరి చుట్టూ తిరిగింది ఆనాటి వారు చాలామందికి తెలుసు. అది తప్పని అనడం లేదు. కాని స్వయంగా రాజకీయాలలో ఎదగడానికి ఎంత కష్టపడవలసి వస్తుందో చెప్పడానికి ఈ పాయింట్ వివరించాల్సి వస్తుంది. తదుపరి చంద్రబాబు అదృష్టం పండి ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు అల్లుడయ్యారు. ఆ తర్వాత ఆయన దశ తిరిగిందన్నది వాస్తవమే కదా!
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. అయినా 1983 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు ఎందుకైనా మంచిదని, తన మంత్రి పదవిని వదలుకోకుండా చంద్రగిరి నుంచి కాంగ్రెస్ ఐ పక్షానే పోటీచేశారు. కాని ఓడిపోయారు. సాధారణంగా కాంగ్రెస్ లో ఓడిపోతే వారికి మళ్లీ రాజకీయ అవకాశాలు రావడానికి కనీసం ఐదేళ్లు ఆగాల్సిందే. కాని చంద్రబాబు వెంటనే తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు.
అప్పటికే టీడీపీలో సీనియర్ నేతలుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు తదితరులు చంద్రబాబును పార్టీలోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా ఎన్టీ రామారావు తనకు కుటుంబపరంగా ఒత్తిడి వస్తోందని చెప్పి చంద్రబాబును పార్టీలో జాయిన్ చేసుకున్నారని నాదెండ్ల పలు ఇంటర్వ్యూలలో చెప్పేవారు.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వల్ల ఎన్టీ రామారావు రాజకీయంగా ఎంత ప్రయోజనం పొందారో కాని, చంద్రబాబు మాత్రం ఎనలేని అవకాశాలు తెచ్చుకోగలిగారు. ఏకంగా పార్టీ పెట్టిన మామ ఎన్టీ రామారావు కు ఎసరు పెట్టే దశకు వెళ్లారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కొన్నారు. చరిత్రలో ఇప్పటికీ చంద్రబాబు వెన్నుపోటు పర్వం అని ప్రత్యర్ధులు గుర్తు చేస్తుంటారు. కాకపోతే అది తన సమర్థత అని ఆయన అనుకోవచ్చు. చంద్రబాబు కనుక ఎన్టీఆర్ అల్లుడు కాకపోతే ఈ అవకాశం వచ్చేదా అన్నది ప్రశ్న.
ఇంకో సంగతి ఏమిటంటే ఎన్టీ రామారావు తన కుమారుడు బాలకృష్ణను రాజకీయ వారసుడుగా ఒక సందర్భంలో ప్రకటిస్తే, దానివల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి ఆ ప్రకటనను ఉపసంహరింప చేశారు.తద్వారా తనకు పోటీ లేకుండా చేసుకున్నారని భావించవచ్చేమో! ఎన్టీఆర్ ను పదవి నుంచి కూలదోసే ప్రక్రియలో ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణ, బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరుల మద్దతు కూడా పొందడం విశేషం.ఎన్టీఆర్ కుటుంబం నుంచి ప్రస్తుతం ఆయన కుమార్తె పురందేశ్వరి ఎంపీగా ఉన్నారు. గతంలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.
వారసులలో ఒకరిగా ఉండబట్టే కదా ఆ అవకాశం వచ్చింది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంలో పురందేశ్వరికి ఎంపీ టిక్కెట్ ను ఆనాటి కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆఫర్ చేశారంటే ఎన్టీఆర్ కుమార్తె అనే కదా! ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఎక్కడ ఆయన రాజకీయ వారసురాలు అవుతారో అన్న భయం కూడా అప్పట్లో కుటుంబ సభ్యులకు ఉండేది కదా! చంద్రబాబు సి.ఎమ్. అయిన కొన్నేళ్లపాటు లోకేష్ ను రాజకీయాలలోకి తీసుకువస్తున్నారా అని అడిగితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. 2009 ఎన్నికలలో అప్పటికే సినిమాలలో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి చంద్రబాబు వాడుకున్నారు.
కాని ఆ తర్వాత మాత్రం ఎన్టీఆర్. రాజకీయంగా ఎదిగితే తన కుమారుడు లోకేష్ కు నష్టం కలుగుతుందని బావించి ఆయనను పక్కనపెట్టేశారు. చివరికి మహానాడు వంటి కార్యక్రమాలలో ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తపడేవారు.ఇలా చేసింది వారసత్వ పోటీ అనే కదా! ఈ క్రమంలో లోకేష్ రాజకీయాలలోకి వచ్చారు. కాని 2014లో ఎందువల్లో ఆయన పోటీ చేయలేదు. అప్పటికి టీడీపీ గెలుపుపై సందేహం వల్ల కావచ్చని కొందరు అంటారు. అనూహ్యంగా టీడీపీ గెలిచింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే లోకేష్ కు ప్రభుత్వంలో పదవి ఇవ్వలేదు. రెండు సంవత్సరాలు గడిచేసరికి ఆయనపై కుటుంబపరంగా ఒత్తిడి పెరగడంతో లోకేష్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు కుమారుడు కనుకే ఆ ఛాన్స్ వచ్చిందన్నది రహస్యమేమీ కాదు. మరెవ్వరికైనా చంద్రబాబు ఇలా పదవులు ఇచ్చారా? ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించినప్పుడు హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చారు.
కాని ఆరు నెలలలోపు ఎమ్మెల్యే కాలేకపోవడంతో పదవిని వదలుకోవల్సి వచ్చింది. తదుపరి హరికృష్ణ ఎమ్మెల్యే అయినా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. లోకేష్ మంత్రిగా ఉంటూ 2019 లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అయినా పార్టీలో ఆయనకు క్రియాశీలకపాత్ర లబించింది. యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. పార్టీకి జాతీయ ప్రదాన కార్యదర్శి అయ్యారు.2024 ఎన్నికలలో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు కన్నా పవర్ ఫుల్ గా ఉన్నారని, ఆయనే వివిధ శాఖలపై పెత్తనం చేస్తున్నారన్న ప్రచారం తెలిసిందే. అంతేకాదు. ఏపీలో రెడ్ బుక్ పేరుతో సాగుతున్న అరాచకాలన్ని ఆయన ఖాతాలోనే పడుతున్నాయి. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయలేని స్థితి ఏర్పడింది. ఇప్పటికే లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఒత్తిడి కుటుంబపరంగా ఉందని చెబుతారు. కాని చంద్రబాబు ఎందువల్లో తన పదవి వదులుకుని కుమారుడిని సీఎం చేయడానికి సిద్ధపడడం లేదన్నది పలువురి భావన.
మరి లోకేష్ లో ఇంకా ఆ సమర్థత రాలేదని అనుకుంటున్నారా? లేక ఇతర కారణాలు ఉన్నాయో తెలియదు. చంద్రబాబు కుమారుడుగా ఉన్నారు కనుకే లోకేష్ కు ఈ అవకాశాలన్నీ వస్తున్నాయన్నది నిజమే కదా! దానినే వారసత్వం అంటారు. ఇందులో తప్పు ఉందా లేదా అన్నది చర్చ కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డి ఆశిస్సులతో ఎంపీ గా గెలిచారు.2009 లో తండ్రి మరణం తర్వాత స్వయంగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చి గెలుపు, ఓటములను చవిచూసి ముఖ్యమంత్రి అయ్యారు. స్వయం ప్రకాశంగా నిలిచారు.
ప్రస్తుతానికి లోకేష్ అలా కాదు.. ఇంకా తండ్రి చాటు కొడుకే. కాకపోతే పరోక్షంగా పెత్తనం చేస్తుండవచ్చు. లోకేష్ ఇమేజీ పెంచడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరుగుతోంది కనిపించడం లేదా! ఇక వ్యాపారాలలో వారసత్వం సర్వసాధారణమే. అయినా చంద్రబాబు వారసత్వం అన్నది అపోహే అనడం ప్రజలను మభ్యపెట్టడానికే అనిపించదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


