సినిమా అంటేనే లాజిక్కులేని మాజిక్కు. పైగా ఆ మాజిక్కుకు ఎమోషన్ జోడిస్తే ఇక అది ఊహకందని క్రియేటివిటీ అవుతుంది. అదే క్రియేటివిటీని టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకు చూడలనుకుంటే ఈ సినిమానే చూడాలి. అదే బేబీ డూ డైడూ. ఈ సినిమా ఆలోచనే సామాన్య ప్రేక్షకులకు ఔరా అనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా ఓ సాహసమనే చెప్పాలి. బాలివుడ్ దర్శకుడు నచికేత్ సామంత్ మంచి హోం వర్క్ తో లాజిక్కులేని మాజిక్కుని ప్రేక్షకులు నమ్మేట్టే చేశారు. పైగా ఈ సినిమా ప్రధాన పాత్రలో ప్రముఖ బాలివుడ్ నటి హ్యుమాఖురేషి నటించి మెప్పించింది.
మరి ఈ బేబీ డూ డై డూ సినిమా కథ ఏంటంటే.. ఓ పేద కుటుంబంలో పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగువ్యక్తిని చూస్తారు. ఆ ముసుగువ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు. ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగువ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ , చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది.
ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగేకొద్దీ అతని మీద తన పగ కూడూ పెంచుకుంటుంది. పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్ ఉమెన్ గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడు గట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి ఈ ప్రయాణంలో బేబికి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా లేదా అన్నది మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న బేబీ డూ డై డూ సినిమాలోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఊహకందనివి. వీకెండ్ కు ఓ మంచి టైంపాస్ సినిమా.


