చెన్నై: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. కొద్ది నిమిషాల క్రితం చెన్నైలో కావేరి హాస్పిటల్లో వయోభారంతో తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 95ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు తెలుగుతోపాటు కన్నడ , తమిళం , హిందీ, ఇంగ్లిష్‌తో సహా పలు భాషలలో సుమారు 60 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక చిత్రాలతో దక్షిణ భారత సినిమాను విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకు దక్కింది. ఆయన తన కెరీర్‌లో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు , ఐదు నంది అవార్డులు , మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక పురస్కారాలను అందుకున్నారు . 2011లో, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
1931 సెప్టెంబర్ 21 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సినిమా దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే, నిర్మాణం, సంగీతం, నటన ఇలా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మూగ చిత్రంగా వచ్చి సంచలనం సృష్టించిన 'పుష్పక విమానం', సైన్స్ ఫిక్షన్ చిత్రమైన 'ఆదిత్య 369', ఇంకా 'భైరవ ద్వీపం', 'మయూరి', 'మైఖేల్ మదన కామరాజు' వంటి విభిన్న ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 95ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' (2026) అనే సంగీత ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించి అరుదైన రికార్డు సృష్టించారు.


