‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. ఇప్పుడు మారుతి అనే మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించనున్నాడు. బుధవారం (ఆగస్టు 19) ఇతడి పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాల అప్‌డేట్స్ వచ్చాయి. అందులో ఒకదానిలో మారుతి పాత్ర చేస్తున్నాడు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ లవ్ స్టోరీలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రకటించి, సంగీత్ శోభన్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
అలానే ఓ మిస్టరీ థ్రిల్లర్ కథతో సంగీత్ శోభన్ హీరోగా ప్రణయ్ రావు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. సాహు గారపాటి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ఓ కొత్త తరహా పాత్రలో సంగీత్ శోభన్ కనిపిస్తాడు. సస్పెన్స్, ఊహించని మలుపులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని నిర్మాత తెలిపారు.


