స్టార్ హీరోల సినిమాల రిలీజ్‌లు వాయిదా
క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్
పాన్ ఇండియా రేంజ్ అంచనాలు, బాక్సాఫీస్ కలెక్షన్స్‌ల పోలికలు... వంటివి ఇప్పటి సినిమాల రిలీజ్‌ల విషయంలో కీలకంగా ఉంటున్నాయి. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కంటెంట్, క్వాలిటీ, వీఎఫ్‌ఎక్స్... ఇలా ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రిలీజ్‌ల పరంగా తమ ప్లాన్‌ను చేంజ్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ ప్లాన్ మార్చుకుని, అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు వస్తున్న కొందరు స్టార్ హీరోల చిత్రాలపై ఓ లుక్ వేయండి.
నో క్లారిటీ
‘విశ్వంభర’ సినిమాను గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ మెరుగైన వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, క్వాలిటీతో కూడిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ చేసేందుకు యూనిట్ ‘విశ్వంభర’ సినిమాను వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఇదే అంటూ ప్రచారం జరిగినా, టీమ్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ‘విశ్వంభర’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటించారు.
భీమవరం దొరబాబు అనే పాత్రలో చిరంజీవి నటించారని తెలిసింది. పధ్నాలుగు లోకాలను దాటి, సత్యలోకానికి వెళ్లి, అక్కడ్నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా భూలోకానికి తీసుకు వస్తాడు? అనే అంశాల ఆధారంగా ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే ఈ సినిమాలో ఓ పుస్తకానికి చాలా ప్రాముఖ్యత ఉందట. అది ఏంటి? అనేది సినిమాలోనే చూడాలి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు చిరంజీవి నటించిన మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘కాకా’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
వారం ఆలస్యంగా...!
వారం ఆలస్యంగా థియేటర్స్‌లోకి వస్తోంది ‘ఆదర్శ కుటుంబం’. వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47: ఏకే 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ సినిమాను అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత అక్టోబరు 9కి వాయిదా వేశారు. ఇలా అనుకున్న సమయం కన్నా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఏడు రోజులు ఆలస్యంగా థియేటర్స్‌కు వచ్చేందుకు సిద్ధమైంది.
చాలా సెలైంట్‌గా ఉండే ఓ ఫ్యామిలీ అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకున్నప్పుడు, ఈ కుటుంబ పెద్ద ఏం చేసి తన ఫ్యామిలీని కా పాడుకున్నాడు? అసలు... ఈ ఫ్యామిలీకి ఉన్న యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిట్టిబాబుగా వెంకటేశ్, స్వర్ణగా శ్రీనిధి శెట్టి నటించారు. చిట్టిబాబు కుమార్తె సంపూర్ణగా యువినా, కుమారుడిగా సర్వగా రాజా ప్రజ్వల్ నటించారు.
పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్ నటించగా, ఓ కీలక పాత్రలో నివేదా పేతురాజ్ నటించారు. హీరోయిన్ డింపుల్ హయాతి ఇందులోని ‘నారాయణమ్మ..’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. ఇదిలా ఉంటే... వెంకటేశ్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’లకు త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. ఇప్పుడు వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రానుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచ నాలు ఏర్పడటం సహజం.
వచ్చే ఏడాదిలో ఫౌజీ
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదని తేలిపోయింది. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఫౌజీ’ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, ఈ చిత్ర
నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ తెలి పారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ పేట్రియాటిక్ సినిమా ‘ఫౌజీ’. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ సైనికుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. అలాగే కథకు రజాకార్ల నేపథ్యం కూడా ఉంటుందని తెలిసింది. ఇక ‘ఫౌజీ’ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఆ తర్వాత డిసెంబరు 3న అంటూ మరో రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 3న కూడా విడుదల కావడం లేదు. దీంతో ‘ఫౌజీ’ సినిమా వచ్చే ఏడాదే రిలీజ్ కానుంది. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో యాక్షన్ మూవీ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ ప్లేస్‌లో ‘ఫౌజీ’ సినిమా వస్తుందా? లేక ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ తర్వాత ‘ఫౌజీ’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
రెండు భాగాలుగా డ్రాగన్?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఈ సినిమా పూజా కార్యక్రమంలో 2026 జనవరి 8న రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ... ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ ఏడాది జూన్‌కి మారింది. కానీ సడన్‌గా ‘డ్రాగన్’ సినిమాని ఏడాది ఆలస్యంగా... అంటే వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అసలు... ఒక సినిమా రిలీజ్ ఏడాది పాటు వాయిదా పడటం ఏంటి? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో జరిగింది.
హిందీ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ తరహాలోనే రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించి, తక్కువ వ్యవధిలోనే ఈ రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ‘డ్రాగన్’ టీమ్ ప్లాన్ చేసిందని, ఈ ప్లాన్‌లో భాగంగానే ‘డ్రాగన్’ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదా పడిందనే ప్రచారం సాగింది. అయితే ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. దీంతో ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణకు కొంత బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ వచ్చే ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది దసరాకు మరోసారి వాయిదా పడిందనే ఊహాగానాలు వినిపించాయి.
కానీ... 2027 జూన్ 11న ‘డ్రాగన్’ సినిమా రిలీజ్ అవుతుందని, ఇటీవల జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ చె΄్పారు. దీంతో 2027 జూన్ 11న డ్రాగన్ వచ్చేది కన్ఫార్మ్ అయిపోయింది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లూగర్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్‌కు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, బిజు మీనన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా వంటి మాఫియాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.
నవంబర్‌లో భోగి?
గంగకు ఐదుగురు సిస్టర్స్. తన సిస్టర్స్ జోలికి వస్తే గంగ ఎంత దూరమైనా వెళ్తాడు. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ‘భోగి’ సినిమా గురించే ఇదంతా. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ మూవీ కావడంతో ‘భోగి’ చిత్రాన్ని రక్షాబంధన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కాలేదు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌లో రాజీ పడకూడదని తమ సినిమాను వాయిదా వేశామని అప్పట్లో చిత్రయూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది.
నేడు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవంబరులో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఇక ఈ మూవీలోని గంగ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. ఇందులోని హీరోయిన్ సులోచన పాత్రలో అనుపమా పరమేశ్వరన్, మందారం పాత్రలో డింపుల్ హయాతి నటిస్తున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా ‘భోగి’ సినిమా కథనం సాగుతుంది. కొన్ని వాస్తవ సంఘటనలకు కొంత కాల్పనికతను జోడించి, కథను రెడీ చేశారట దర్శకుడు సంపత్ నంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
దసరాకు రణబాలి
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘రణబాలి’ సెప్టెంబరు 11న రిలీజ్ కావాల్సింది. కానీ దసరా సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్ చేస్తున్నారు. సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన తాజా సినిమా ‘రణబాలి’. ఈ పీరియాడికల్ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు.
19వ సెంచరీ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి‘ సినిమా తెరకెక్కింది. ఇందులో రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ నటించగా, జయమ్మ పాత్రలో రష్మికా మందన్నా, సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.
ఇలా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన తెలుగు సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
రాకా రాక ఎప్పుడో..!
అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా చిత్రీకరణ దాదాపు రెండు సంవత్సరాలుగా జరుగుతోంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా సరైన స్పష్టత రాలేదు. 2027 డిసెంబరులో ఈ సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ నుంచి అయితే రిలీజ్ పరంగా ఏ అప్‌డేట్ రాలేదు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇందులో ఒకటి నెగటివ్ రోల్ అని తెలిసింది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని భోగట్టా.
దీపికా పదుకోన్ ఓ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని, రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్‌సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు ‘రాకా’ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుందని, ఒకేసారి రెండు భాగాలను చిత్రీకరిస్తున్నారని, చిత్రీకరణ పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్.
తెలుగులో రిలీజ్ కావాల్సిన సినిమాలే కాదు... ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన కొన్ని భారీ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా తారుమారు అయ్యాయి. రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాను ఫస్ట్ మార్చి చివర్లో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఫైనల్‌గా ‘పెద్ది’ మూవీ జూన్ 4న విడుదలైంది. అలాగే ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కావాల్సిన అఖిల్ ‘లెనిన్’ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది మార్చి 26కి షెడ్యూల్ అయిన నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఫైనల్‌గా సెప్టెంబరు 24న రిలీజైంది. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా మేలో విడుదల కావాల్సి ఉండగా ఫైనల్‌గా జూన్ 19న విడుదలైంది... ఇలా రిలీజ్ డేట్స్ మార్చుకుని విడుదలైన సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
– ముసిమి శివాంజనేయులు


