తెలుగులో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి ఆపై నిర్మాతగా మారి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేశ్‌కి ఒంగోలు కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో భాగంగా రూ.95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.
(ఇదీ చదవండి: ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు..బాధగా ఉంది: చిరంజీవి)
గతంలో మద్దిరాలపాడుకి చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకి బండ్ల గణేశ్ రూ.95 లక్షలు బాకీ ఉన్నాడు. అయితే దీన్ని తీర్చే క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్ ఇచ్చాడు. అయితే ఇది బౌన్స్ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదే కాదు గతంలోనే ఈ తరహా కేసులు బండ్ల గణేశ్‌పై ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకుగానూ.. బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంక్ వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ని ఇతడు ఆశ్రయించగా, వేలం ప్రక్రియని రద్దు చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది.
దీనిపై యూనియన్ బ్యాంక్.. హైకోర్టుని ఆశ్రయించగా ఆ ఉత్తర్వులని కొట్టివేస్తూ బ్యాంక్ చర్యని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇందులో జోక్యం జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
(ఇదీ చదవండి: ‘బాయ్స్’.. తీగ కాదు అమ్మాయి నడుము)


