పుష్పక విమానంలో సింగీతం పయనం | Tributes to Film director and actor Singeetham Srinivasa Rao | Sakshi
Sakshi News home page

పుష్పక విమానంలో సింగీతం పయనం

Oct 4 2026 6:00 AM | Updated on Oct 4 2026 6:00 AM

Tributes to Film director and actor Singeetham Srinivasa Rao

నివాళి

సింగీతం శ్రీనివాసరావు టైమ్‌ మిషన్‌ ఎక్కారు. అయితే ఆయన భౌతిక శరీరమే అంతరిక్ష సెట్‌కు చేరుకుంటుంది. ఆయన తన సినిమాలతో అమరుడై ‘మానసవీణ మధుగీతం’ ఆలపిస్తూనే ఉంటాడు. కె.వి. రెడ్డి శిష్యుడు... గురువును మించిన శిష్యుడయ్యాడు. ఆయనకు జానర్‌ లేదు. ‘మూకీ’ నుంచి ‘మరుగుజ్జు’ వరకు చేయని ప్రయోగం లేదు. 94 ఏళ్ల వయసులో కూడా దర్శకత్వం వహించిన అలుపెరుగని సృజనమూర్తి. సింగీతం సినీ జీనియస్‌. ఆయనకు వీడ్కోలు.

సింగీతం శ్రీనివాస రావు ఇక లేరు 
ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్‌ రైటర్, నిర్మాత, సంగీత దర్శకుడు, నటుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఇక లేరు. వయోభారంతో కూడిన ఆరోగ్య సమస్యలతో ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఓ కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 

తండ్రి రామచంద్రరావు ప్రధానోపాధ్యాయుడు, తల్లి శకుంతల బాయి వయొలిన్‌ వాద్యకారిణి. ఇటు విద్యార్థిగా, అటు నాటకాలు... ఇలా రెండింటిలోనూ ప్రతిభను కనబరిచారాయన. చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో డిగ్రీ పట్టభద్రుడయ్యారు. చెన్నై సాలిగ్రామం భాస్కర కాలనీ పార్కులో కుమార్తె సుధా కార్తీక్, ఇతర కుటుంబ సభ్యులతో ఆయన కలిసి ఉంటూ వచ్చారు. భారతదేశపు అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి, వినూత్న చిత్ర దర్శకుల్లో ఒకరిగా పేరు గడించారు సింగీతం. 

తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఆంగ్లంతో సహా పలు భాషల్లో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక విధానం ద్వారా దక్షిణ భారత సినిమాను విప్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకు దక్కింది. 94 ఏళ్ల వయసులో ఆయన ‘సింగ్‌ గీతం’ సినిమాకి దర్శకత్వం వహించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ మూవీ ఈ ఏడాది జూన్‌ 12న విడుదలైంది. సింగీతం శ్రీనివాస రావు సతీమణి లక్మి కళ్యాణి 2022 మే 28న కన్నుమూశారు. సింగీతం పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి.   

నటుడు కమల్‌హాసన్‌ తన తండ్రిని కోల్పోయి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు తన సినీ తండ్రిని కోల్పోయారు. కమల్‌కు సింగీతం తండ్రి సమానులు. ‘సొమ్మొకడిది సోకొకడిది’లో కమల్‌హాసన్‌ డబుల్‌ యాక్షన్‌. తెలుగులో తమిళ హీరోని పెట్టి డబుల్‌ యాక్షన్‌ సినిమా తీయడం సింగీతం ప్రయోగం. అందులో తెలివైన కమల్‌హాసన్‌ మోసగాడైతే, అమాయక కమల్‌హాసన్‌ డాక్టర్‌. ఆ డాక్టర్‌ స్థానంలో కూచున్న మోసగాడు పేషెంట్‌గా వచ్చిన రమాప్రభను గర్భవతిగా డిక్లేర్‌ చేయడమే కాకుండా ఆమె వాడాల్సిన మందుగా రేడియోలో విన్న అనాసిన్‌ రాస్తాడు. ఈ సరదా సరదా సినిమాను తెలుగు ప్రేక్షకులు నవ్వుతూ నవ్వుతూ హిట్‌ చేశారు. ఆ సినిమాలోని ‘ఆ పొన్ననీడన ఈ కన్నెవాడలో ఉన్నా... వేచి ఉన్నా’ పాట రేడియోలో వస్తే కమల్, రోజా రమణితో పాటు సింగీతం కూడా గుర్తుకు వస్తారు.

కమల్‌హాసనే సొంత నిర్మాణ సంస్థ పెట్టి ‘అమావాస్య చంద్రుడు’ తీయాలనుకున్నప్పుడు సింగీతాన్నే దర్శకుడిగా తీసుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకూ భారతీయ సినిమాల్లో అంధులుగా నటించే పద్ధతి వేరు. ఆ కృత్రిమ పద్ధతి నుంచి కమల్‌లోని నటుణ్ణి బయట పడేయాలంటే సింగీతమే గురువు. ఇంతకూ ఆ కథ ఏమిటి? మనిషికి చూపు లేకపోవచ్చు కానీ హృదయానికి ఉండదా? ప్రేమకు ఉండదా? అనుభూతికి ఉండదా? సినిమా విడుదలైనప్పుడు జనం ఎలా రిసీవ్‌ చేసుకోవాలో తెలియక కాస్త అయోమయం పడ్డారు. తర్వాత అది కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచింది. ‘సుందరమో సుమధురమో చందురడంటిన చందన శీతలమో’... సుందర రామ్మూర్తి రాసిన సుందరగీతం ఇందులోదే.

పిచ్చికి మేధస్సు తోడవ్వాలి. అప్పుడు కళ కొత్తగా రాణిస్తుంది. అప్పుడెప్పుడో మూకీ సినిమాలు వచ్చేవి. ఇప్పుడెందుకు మూకీ తీయకూడదు అనుకున్నారు సింగీతం. ఇది మేధ. ఈ మేధను పిచ్చిగా నమ్మి ముందుకు వచ్చినవాడు కమల్‌హాసన్‌. భారతీయ సినిమాల్లో దక్షిణాది వారి ఘనత ‘పుష్పక విమానం’. మాట లేకుండా కేవలం ఆర్టిస్టుల ప్రెజెన్స్‌తో కథను అర్థం చేయించిన సినిమా అది. మాట ఉన్న సినిమా కంటే ఎక్కువగా ప్రేక్షకుడి మనసును తాకిన సినిమా. నవ్వించి ఏడ్పించిన సినిమా. ఆ చిన్న సినిమాలోనే ఎంత క్రియేటివిటీ. 

రోజూ అలవాటైన థియేటర్‌ శబ్దాలను టేప్‌లో రికార్డు చేసుకొని వింటూ పడుకోవడం, కిడ్నాప్‌ చేసి ఎనీమా ఇవ్వడం, మంచు ఐసుతో హత్యకు ప్లాన్‌ చేయడం... హాలీవుడ్‌ వారు దిగదుడుపు. అన్నట్టు ఈ సినిమాకు సెన్సార్‌ ఎలా? ఏ రాష్ట్రం నుంచి తీసుకోవాలి? ఒక కిటుకు పాటించారు. ఏ భాషలో రిలీజ్‌ చేయాలనుకుంటే ఆ ప్రింట్‌లో కమల్‌ ఉంటున్న ‘చావిడి’లోని రేడియోలో ఆ భాష ప్రకటన వినపడేలా చేశారు. బాగా తీస్తే మూకీ అయినా హిట్‌ చేస్తాం అని ప్రేక్షకులు తమ ‘మౌత్‌ టాక్‌’తో నిరూపించారు. ఈ సినిమాలో పి.ఎల్‌. నారాయణ పాత్ర గుర్తుందా? ఆ బిచ్చగాడి దగ్గర డబ్బున్నా బిచ్చగాడే. సంపద ఉండి భార్యతో స్పర్థలున్నవాడు (కిడ్నాప్‌ అయినవాడు) కూడా సంతోషం లేని బిచ్చగాడే. జీవితం మనకు ఇచ్చేది మనం పొందడం తెలియాలి.

సీజీలు, గ్రాఫిక్సు ఇంకా హాలీవుడ్డే పూర్తిగా అందుకోని రోజుల్లో హీరోని మరుగుజ్జుగా చూపడమా? ‘చూపలేమా?’ అని అడిగాడు కమల్‌. చూపొచ్చు అన్నారు సింగీతం. ‘విచిత్ర సోదరులు’ తయారైంది. ‘రాజా చేయి వేస్తే అది రాంగై పోదులేరా’ అని సింగీతం తన దర్శకత్వ నైపుణ్యమంతా ఉపయోగించి తీశారు. ఒక మామూలు కమల్‌హాసన్, మరో మరుగుజ్జు కమల్‌హాసన్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి జనానికి వింత పుట్టించారు. విచిత్రంగా ఉందే అనిపించారు. తీయడంలోనే కాదు కథ అల్లడంలోనూ కొత్తదనమే. మరుగుజ్జుకు కూడా మనసుంటుందనీ... ప్రేమిస్తాడని సగటు జనానికి అర్థం చేయిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నవారే అన్నింటికీ అర్హులు అనే మూసను సింగీతం చాలా స్పృహతో బద్దలు కొట్టారు. ఇందులో నగేష్‌ చేత విలన్‌ వేషం వేయించడం విశేషం. మరుగుజ్జు పాడే ట్రాజెడీ గీతం ‘నిన్ను తలచి మైమరచా’ సమోన్నతంగా నిలబడింది.

స్క్రీన్‌ మీద ఒక కమల్‌ కనిపించడమే పండుగ అనుకుంటే నలుగురు కమల్‌హాసన్లు కనిపిస్తే? ‘మైకేల్‌ మదన కామరాజు’ అదే. ‘తిప్పూ తిప్పూ అంటూ ఉంటే స్కూటర్‌ తిప్పమన్నాడేమోనని కింద పడ్డానండీ’ అని వంటవాడు కమల్‌ చెప్తుంటే థియేటర్‌ గొల్లుమంటుంది. ఆరోగ్యకరమైన హాస్యం జీనియస్‌లకే సాధ్యం. ఈ సినిమాలోని ‘భీం భాయ్‌... భీం భాయ్‌’ జోక్‌ ఇప్పటికీ ప్రేక్షకుల వాడుకలో ఉంది. అసలు ఈ సినిమాలోని రెండు పాత్రలను తీసుకొని, ఆ ఇన్‌స్పిరేషన్‌తో ‘అదుర్స్‌’ రాసుకున్నారా అని అనిపిస్తుంది. ఈ సినిమాలో టైటిల్స్‌ పడేటప్పుడు వచ్చే పాటను సింగీతం పాడటమే కాదు... నటిస్తారు కూడా. ఈ కామెడీ వరుసలోనే ‘నవ్వండి లవ్వండి’, ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’ ఉన్నాయి. ‘ముంబై ఎక్స్‌ప్రెస్‌’ను చూసిన ప్రతిసారీ కొత్తగా నవ్వు వస్తుంటుంది. ఇంకొక ముఖ్యమైన సినిమా ‘ఆడవాళ్లకు మాత్రమే’. వర్క్‌ప్లేస్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ మీద దక్షిణాదిలో వచ్చిన తొలి సినిమా ‘ఆడవాళ్లకు మాత్రమే’. ఇందులో హెరాస్‌ చేసే బాస్‌గా నాజర్, బుద్ధి చెప్పే స్త్రీలుగా రేవతి, ఊర్వశి నటించారు. 

చాలా మంది సినిమా పరిశ్రమలో ‘చూద్దాం’ అని వస్తారు. కొందరు ‘చేద్దాం’ అని వస్తారు. మరికొందరు ‘నిలబడదాం’ అని వస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే ‘మన శాశ్వత ముద్రను వదిలిపెడదాం’ అని వస్తారు. అలాంటి వాళ్లు లెజెండ్స్‌ అవుతారు. సింగీతం లెజెండ్‌. దర్శకత్వం తెలిసినవాడు ఒక్కో కథకు ఎలా దర్శకత్వం వహించాలో అలవోకగా తెలుసుకుంటాడు. అది తెలియనివాడు ఒకే కథను ఒక్కలాగే చెప్తూ కనుమరుగవుతాడు. సింగీతం  కెమెరాతో కథ చెప్పగలడు. ఆ కథ ‘పంతులమ్మ’ అయితే  ఒక రీతిలో చె΄్తాడు. ‘అమెరికా అమ్మాయి’ అయితే మరో రూపులో చె΄్తాడు. మరి బయోపిక్‌ అయితే? దానినీ సినీ గ్రామర్‌లోకి తెచ్చి హిట్‌ కొడతాడు. 

నిజ జీవితంలో కాలు పోగొట్టుకున్న డాన్సర్‌ సుధా చంద్రన్‌ జీవిత కథను తెర మీద చూపాలనుకున్నప్పుడు దానికి రక్తమాంసాలను, ఉద్వేగ ఉద్విగ్నతలను, సంఘటనలను, ఆరోహణలో సాగే కథను ఇవ్వడం సామాన్యం కాదు. ‘మయూరి’తో సింగీతం ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. బయోపిక్‌లు ఎలా తీయాలో తెలియని రోజుల్లో తెలుగులో వచ్చిన క్లాసిక్‌ ‘మయూరి’. ‘ఇది నా ప్రియనర్తన వేళ’... బాల సుబ్రహ్మణ్యం చేత సంగీతం చేయించడం సింగీతం మార్క్‌.

కె.వి. రెడ్డికి తాను అసిస్టెంట్‌గా పని చేసిన ‘మాయాబజార్‌’ తీసిన సంస్థకు సింగీతం అందించిన గురుదక్షిణ ‘భైరవద్వీపం’. జానపదాల ఊసులేని సమయంలో జానపదం తీసి సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించాడాయన. బాలకృష్ణకు ఈ సినిమా కలికితురాయిగా నిలిచింది. విజయావారి కథల వరుసలో రావి కొండలరావు కల్పించిన ఈ కథను టెక్నికల్‌గా టాప్‌క్లాస్‌ ప్రమాణాలతో చె΄్పాడాయన. మాధవ పెద్ది సురేష్‌ను సంగీతానికి తీసుకోవడం కూడా ఒక ప్రయోగమే. సాధారణంగా అంత పెద్ద సినిమాకు ఊపులో ఉన్న ఇళయరాజానో, చక్రవర్తినో తీసుకోవాలి. కానీ మాధవ పెద్దితో పాటలన్నీ హిట్‌ చేశారు సింగీతం. దాని ఆర్‌ఆర్‌ కూడా అద్భుతం. నాటి ‘నరవరా కురువరా’ పాట ఈ సినిమాలో ‘నరుడా ఓ నరుడా’గా మారడం సింగీతం స్పెషల్‌.

దర్శకులు బాగా చదువుకోవాలి. చదువుతూ ఉండాలి. మన దగ్గర పుస్తకాలు చదివే దర్శకులు తక్కువ. కానీ సింగీతం గొప్ప చదువరి. అంతే కాదు కథలు రాసే రచయిత కూడా. ఆయన సంగీతజ్ఞానం అపారం. ప్రపంచ సినిమాల స్క్రీన్‌ప్లేలు కొట్టిన పిండి. సాహిత్యంలో గొప్ప క్లాసిక్స్‌ తెలుసు. అందుకే ఆయన మనసులో ‘టైమ్‌ మిషన్‌’ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ‘ఆదిత్య 369’ అనే అపూర్వ సినిమాగా మారింది. తెలుగువారు ఈ సినిమాలో టైమ్‌ మిషన్‌ ఎక్కారు. తమకెంతో ఇష్టమైన రాయలవారిని చూశారు. తెనాలి రామకృష్ణుడి కొంటె చేష్టలకు పగలబడి నవ్వారు. యంగ్‌ డైరెక్టర్ల కంటే చాలా గొప్పగా ఆ కాలానికి తగ్గ టేకింగ్‌తో ‘ఆదిత్య 369’ తీశారు సింగీతం. దాని సీక్వెల్‌ గురించి అనేక ఆలోచనలు సాగాయి. ఇక మీద ఆ సీక్వెల్‌ గురించి మనం వినం. సింగీతం రాజేంద్రప్రసాద్‌ హీరోగా తీసిన ‘మేడమ్‌’, ‘బృందావనం’ జనం మెచ్చిన సినిమాలే.

సింగీతం శ్రీనివాసరావు మన దాసరి, కె. రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణలకు మల్లే 100కి పైబడ్డ సినిమాలు తీయలేదు. కానీ ఆయన తన చాలా సినిమాలను మైలురాళ్లుగా నిలబెట్టారు. ఒక కొత్త దర్శకుడు ఆ మైలురాళ్లను చూసి వాటిలో ఒకటి రెండు దాటగలిగితే చాలు అనే స్థాయిలో ఆయన కృషి సాగింది.

సింగీతం మరణంతో ఒక గొప్ప మేధో దర్శకుడు తెలుగువారికి దూరమయ్యాడు. ఆయన తీసిన ‘అమెరికా అబ్బాయి’లో ‘ఏ దేశమేగినా’ పాట ఉంది. అందులో ‘పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అనే పంక్తి ఉంది. సింగీతం కృషిని చూస్తే  ‘పొగడరా నీ తల్లి సినీ భారతిని’ అంటూ తెలుగు సినిమాకు జేజేలు పలుకుతున్నట్టుగా ఉంటుంది.
ఆయనకు నూరు వీరతాళ్లు.
 
సంగీత దర్శకునిగా...
ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వర రావుకు సింగీతం శ్రీనివాసరావు శిష్యుడు. ‘భాగ్యద లక్ష్మి బారమ్మ’, ‘సంయుక్త’ అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు సింగీతం శ్రీనివాసరావు సంగీతం అందించారు. 

అవార్డులు... 
సింగీతం శ్రీనివాసరావు 2021 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్  హాలులో జరిగిన సాక్షి మీడియా ఎక్స్‌లెన్స్  అవార్డుల్లో భాగంగా 2019గాను జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆయన తరఫున ఈ అవార్డును ప్రముఖ డైరెక్టర్‌ గుణశేఖర్‌ అందుకున్నారు. 

జాతీయ చలనచిత్ర పురస్కారాలు
1973 –  ఉత్తమ తమిళ చలన చిత్రం: ‘దిక్కట్ర పార్వతి’ 
1988 – ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం (పుష్పక)– (కన్నడ) 

నంది అవార్డులు 
1985 – ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత – మయూరి
1985 – ఉత్తమ దర్శకుడు – మయూరి
1992 – ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత – బృందావనం
1994 – ఉత్తమ దర్శకుడు – భైరవ ద్వీపం
2012 – జీవితకాల సాఫల్యానికి బి.ఎన్‌. రెడ్డి జాతీయ పురస్కారం 

19వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
జీవితకాల సాఫల్య పురస్కారం (2021)
ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జీవితకాల సాఫల్య పురస్కారం (2011)

కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
1982 – ఉత్తమ చిత్రంగా కర్ణాటక రాష్ట్ర పురస్కారం (ప్రథమ స్థానం)– హాలు జేను
1985 – ఉత్తమ స్క్రీన్‌ ప్లేకి కర్ణాటక రాష్ట్ర పురస్కారం- భాగ్యద లక్ష్మి బారమ్మ 
1986 – ఉత్తమ స్క్రీన్‌ ప్లేకి కర్ణాటక రాష్ట్ర పురస్కారం – ఆనంద్‌

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌
1974 – ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం– తమిళం – దిక్కట్ర పార్వతి
1985 – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం (తెలుగు) – మయూరి
1987 – ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం కన్నడ – పుష్పక విమాన  

ఏ ఫ్రూట్‌ కట్స్‌ ద నైఫ్‌
సింగీతం శ్రీనివాసరావు సృజనకు మరణం లేదు. ఆయన తుది శ్వాస విడిచేవరకూ కూడా సినిమాల కోసమే పని చేశారు. ‘ఏ ఫ్రూట్‌ కట్స్‌ ద నైఫ్‌’ అనే టైటిల్‌తో సింగీతం ఓ స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశారు. సెప్టెంబరు 5న ఈ విషయాన్ని దర్శక–నిర్మాత నాగ్‌ అశ్విన్‌కు సింగీతం తెలిపారు. ఈ విషయాన్ని సింగీతం మరణ వార్త విన్న కొన్ని గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగ్‌ అశ్విన్‌ షేర్‌ చేశారు. దర్శకుడిగా సింగీతం చివరి సినిమా ‘సింగ్‌ గీతం’కు నాగ్‌ అశ్విన్‌ నిర్మాత అన్న విషయం తెలిసిందే.


  – సాక్షి, చెన్నై
  – ఖదీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement