నా నియోజకవర్గంలో నీకేం పని.. నారాయణపై కోటంరెడ్డి ఫైర్‌! | Kotamreddy Sridhar Reddy Objects To Minister Narayana Visit In His Constituency | Sakshi
Sakshi News home page

నా నియోజకవర్గంలో నీకేం పని.. నారాయణపై కోటంరెడ్డి ఫైర్‌!

Nov 16 2026 9:56 AM | Updated on Nov 16 2026 10:01 AM

Kotamreddy Sridhar Reddy Objects To Minister Narayana Visit In His Constituency

టీడీపీలో నివురుగప్పిన నిప్పు.. ఆదివారం బద్ధలైంది. దీనికి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం వేదికైంది. తనకు సమాచారమివ్వకుండానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి మంత్రి నారాయణ ఎలా వస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సిటీ నియోజకవర్గంలో తాను పర్యటిస్తే మీరు ఒప్పుకొంటారానని అమాత్యుడి అనుచరులను ఆయన నిలదీశారని తెలుస్తోంది. త్వరలో నెల్లూరు నగరంలో పర్యటించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సింహపురిలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరులో అధికార పార్టీలో అంతా సవ్యంగా ఉందని పైకి చెప్తున్నా, లోపల మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నెల్లూరు రూరల్‌లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటించడం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది.  

రగిలిపోతున్న కోటంరెడ్డి 
తనకెలాంటి సమాచారమివ్వకుండానే తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ అమాత్యుడి తీరుపై కోటంరెడ్డి రగిలిపోతున్నారు. తన ప్రాంతానికి వచ్చి సమీక్షలు చేయడంపై మండిపడుతున్న ఈయన ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం. దీనికి దీటుగా నెల్లూరు సిటీ పరిధిలో త్వరలో పర్యటించేలా సన్నాహాలు చేస్తున్నారనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
 
తరచూ అవమానాలే.. 
ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడిన నారాయణ.. ఈ ప్రోగ్రామ్‌ విషయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 56వ డివిజన్‌ కార్పొరేటర్‌గా విజయం సాధించిన భానుశ్రీ కుమార్తె వెంకటశ్రీదివ్యకు సమాచారమివ్వకపోవడం ప్రొటోకాల్‌ ఉల్లంఘనేనని టీడీపీ రూరల్‌ వర్గాలు మండిపడుతున్నాయి. నెల్లూరులో మంత్రి లోకేశ్‌ ఇటీవల పర్యటించిన సమయంలోనూ కోటంరెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. తన నియోజకవర్గంలో జరగాల్సిన కార్యక్రమాన్ని చివరి క్షణంలో మార్చి.. సిటీలో మంత్రి నారాయణ ఏర్పాటు చేశారనే ఆగ్రహంతో శ్రీధర్‌రెడ్డి రగిలిపోతున్నారు. తాజాగా ఆయన్ను మరోసారి అవమానించారనే ప్రచారం జరుగుతోంది.  

పెరిగిన అగాధం 
కార్పొరేషన్‌ నిధుల కేటాయింపు.. సమీక్ష సమావేశాల నిర్వహణ విషయంలో మంత్రి నారాయణ గతంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై నగరపాలక సంస్థ కార్యాలయానికి కోటంరెడ్డి వెళ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందర్భమూ ఉంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామంతో వీరి మధ్య అగాధం తారస్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.  

పలు ప్రోగ్రామ్‌లకు ప్లాన్‌ 
మంత్రి నారాయణ తీరుపై భగ్గుమంటున్న శ్రీధర్‌రెడ్డి.. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో త్వరలో పర్యటించనున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అమాత్యుడికి సమాచారం లేకుండా పలు కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్‌ చేసుకుంటున్నారని తెలుస్తోంది.  

పరపతి ఉంది.. నాకేంటి..! 
కూటమి ప్రభుత్వంలో నంబర్‌ – 2 అని చెప్పుకొనే అమాత్యుడు నారాయణ తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. పార్టీ అధిష్టానం వద్ద తనకు పరపతి ఉందనే దీమాతో ఎమ్మెల్యేలను ఆయన ఏ మాత్రం లెక్కచేయడంలేదని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా పేర్కొంటున్నాయి. నెల్లూరు రూరల్‌ పరిధిలోని పరమేశ్వరినగర్‌లో నిర్మాణంలో ఉన్న అబ్దుల్‌ కలామ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్, మేయర్‌గా విజయం సాధించిన రూప్‌కుమార్‌యాదవ్‌తో కలిసి మంత్రి పర్యటించడమే దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇదీ చదవండి: పేరుకు జనసేన... పార్టీ మాత్రం టీడీపీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement