పొదలకూరు: పదో తరగతి పరీక్షల్లో వసతిగృహాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సోషల్ వెల్ఫేర్ జిల్లా డీడీ శోభారాణి పేర్కొన్నారు. స్థానిక ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి.. ప్రభుత్వం నుంచి అందిన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. టెన్త్‌లో ఈ ఏడాది నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని, ఇదే తరహాలో ఈసారి పొందాలని కోరారు. ఏఎస్‌డబ్ల్యూఓ సుధామణి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన క్రీడా పోటీలు
కావలి: పట్టణంలోని జవహర్ భారతి క్రీడా మైదానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వీఎస్‌యూ ఇంటర్ కళాశాలల మెన్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి.
● బాస్కెట్‌బాల్‌లో జేబీ జట్టు విజేతగా, కావలి శ్రీచైతన్య డిగ్రీ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచాయి.
● హ్యాండ్‌బాల్‌లో వీఎస్‌యూ నెల్లూరు, జేబీ జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
● టెన్నిస్ డబుల్స్ విభాగంలో జేబీ, జెనెక్స్ కళాశాల జట్లు తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు బహుమతులను జేబీ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, రమణ అందజేశారు. వర్సిటీ అబ్జర్వర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మణికంఠ, అజయ్‌బాబు, శివ, బ్రహ్మయ్య, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్షాలు కురవాలని
కాంక్షిస్తూ..
ఆత్మకూరు: వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ పట్టణంలోని చెరువు వద్ద వరుణ హోమాన్ని ఆదివారం నిర్వహించారు. తొలుత సుందరమ్మ రామాలయం నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి.. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలతో పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా చెరువు వరకు గ్రామోత్సవంగా తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వరుణ హోమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాలను అందజేశారు. కంచి పరమేశ్వరరెడ్డి దంపతులు, కుడుముల సుధాకర్‌రెడ్డి దంపతులు, రాజవోలు పెంచలయ్య దంపతులు పాల్గొన్నారు.
అల్లూరును పంచాయతీగా
మార్చేంత వరకు పోరాటం
అల్లూరు: అల్లూరును పంచాయతీగా మార్చేంత వరకు తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను రెండో రోజూ బహిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశమైన అన్ని ప్రధాన పార్టీల నేతలు మాట్లాడారు. అల్లూరును పంచాయతీగా మార్చుకోవాలంటే ముందుగా ఎన్నికలను బహిష్కరించాలని, దీనికి అన్ని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు సహకరించాలని కోరారు. నామినేషన్లను సోమవారం సైతం దాఖలు చేయకుండా సహకరించాలన్నారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని తదుపరి చర్యలకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నీలం సాయికుమార్, బాలకృష్ణంరాజు, మధురెడ్డి, సుధీర్‌రెడ్డి, ఉస్మాన్, కరుణాకర్, టీడీపీ నేతలు శంకర్‌రెడ్డి, బండి శ్రీనివాసులురెడ్డి, సుధాకర్‌రెడ్డి, జనసేన నేతలు పోలయ్య, కార్తీక్‌శర్మ, బీజేపీ నేత హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లాకు వర్ష సూచన
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్‌గా సోమవారం నాటికి రూపాంతరం చెందనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉంటూ సముద్రంలోకి వేటకెళ్లరాదని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు.


