● నిరాదరణకు గురవుతున్న వైనం
● భూములున్నా.. వినియోగం అంతంతే..
● చెరువు భూమిని కేటాయించి
చేతులు దులుపుకొన్న ప్రభుత్వం
● 60 ఎకరాల్లో వినియోగంలో ఉన్నది
16 ఎకరాలే
● ఆక్రమణదారుల చెరలో
మరో ఐదెకరాలు
కేవీకే ద్వారా మెరుగైన సేవలు
కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తున్నాం. సేంద్రియ ఎరువులు, పురుగు మందుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. ప్రయోగశాల ద్వారా అవసరమైన ప్రయోగాలు నిర్వహిస్తున్నాం. ఉచిత శిక్షణ, అవగాహన కార్యక్రమాలను తరచూ చేపడుతున్నాం.
– డాక్టర్ ఎన్.వీ. సరళ, అధిపతి,
సీనియర్ శాస్త్రవేత్త
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లా వ్యవసాయ రంగానికి తలమానికంగా నిలవాల్సిన నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలతో నిరాదరణకు గురవుతోంది. నూతన ఆవిష్కరణలకు నోచుకోకుండా లక్ష్యాల సాధనలో వెనుకబడుతోంది. ఇక్కడి ఉన్నతాధికారితోపాటు మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులే కావడం గమనార్హం. అత్యంత కీలకమైన సస్యరక్షణ, సాగు, విస్తరణ, హోమ్‌సైన్స్ విభాగాల్లోనూ కాంట్రాక్ట్ సిబ్బందే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించడం మినహా ఈ కేంద్రం ద్వారా కొత్తగా ఒనగూరుతున్న ప్రయోజనం పెద్దగా లేదనే విమర్శలున్నాయి. జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ రకాల నూతన వంగడాలను సాగు చేసి, అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మార్గదర్శకంగా నిలవాల్సిన కేంద్రం కేవలం ఆరెకరాల్లో వరి సాగుకే పరిమితమైంది.
10 ఎకరాల్లో చేపల గుంతలు
60 ఎకరాల కేవీకే ప్రాంగణంలో చేపల పెంపకానికి ప్రాధాన్యతనిస్తూ 10 ఎకరాలను కేటాయించారు. అయితే సంబంధిత ఇన్‌చార్జి ఏకపక్ష నిర్ణయాలు, నిర్వహణ లోపాలతో ప్రస్తుతం చేపలు ఉన్నప్పటికీ గుంతలు నిరుపయోగంగా మారాయి. చేపలు పట్టేందుకు జాలర్లు అందుబాటులో లేరనే కారణంతో వేటను నిలిపివేశారు. దీంతో గుంతల్లోని చేపలు 8 నుంచి 10 కిలోల బరువుకు పెరిగి ముదిరిపోతున్నట్లు సమాచారం. కేవీకేలో పెంచిన చేపలను సకాలంలో పట్టి స్థానిక ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించి, ఆ మొత్తాన్ని ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత ఇన్‌చార్జి నిర్లక్ష్య వైఖరి కారణంగా నగర ప్రజలకు నాణ్యమైన సేంద్రియ చేపలు అందుబాటులోకి రావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికీ గండిపడుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పుడప్పుడు ఆదివారం కొన్ని కిలోల చేపలను మాత్రమే విక్రయించి సరిపెడుతున్నట్లు తెలిసింది.
చెరువు భూమి భారంగా..
కేవీకేకు కేటాయించిన 60 ఎకరాల్లో పడారుపల్లి చెరువు భూమి 30 ఎకరాలు ఉంది. దీని నిర్వహణ లోపంతో పడారుపల్లి గ్రామస్తులకు గానీ, కేవీకేకు గానీ ఉపయోగపడకుండా నిరుపయోగంగా మారింది. విలువైన భూమి ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆక్రమించి..
కేవీకే ఉన్న భక్తవత్సల నగర్ ప్రాంతంలో నివాస స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండటంతో ఆక్రమణదారుల కన్ను ఈ భూమిపై పడింది. కొందరు దశలవారీగా ఐదెకరాలను ఆక్రమించి, ఇళ్ల స్థలాలుగా విక్రయించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఉన్నతాధికారులకు స్థానిక పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడం ఆక్రమణదారులకు వరంగా మారింది. దీంతో ఆక్రమణదారులు భారీగా లబ్ధి పొందారు.


