నెల్లూరు(పొగతోట): డ్వామాలో జరుగుతున్న వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తే వామ్మో అనక మానరు. ఇక్కడంతా వింత ధోరణి నడుస్తోంది. ఎన్నికల వేళ నిబంధనలను తుంగలో తొక్కుతూ బదిలీలు, డిప్యుటేషన్లను జరుపుతున్నారు. ఉదాహరణకు పొదలకూరులో పనిచేస్తున్న టీఏను ముత్తుకూరుకు.. అక్కడ పనిచేస్తున్న టీఏను పొదలకూరుకు గత నెల 31న డిప్యూట్ చేశారు. ఇదే తరహాలో పొదలకూరు మండలంలో పనిచేస్తున్న బీఎఫ్టీని రాపూరుకు పంపారు. దగదర్తి మండల ఏపీఓను సస్పెండ్ చేశారు. సస్పెండైన డీఎస్కేతో పనులు చేయించుకుంటున్నారు.
అంతా గందరగోళం
వీబీ – జీ రామ్ జీలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. సక్రమంగా పనిచేయకుండా.. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయని.. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం, షోకాజ్ నోటీసులివ్వడం, సస్పెన్షన్ వేటేస్తున్నారు. వాస్తవానికి ఇలా సస్పెండ్ చేశాక అధికారికంగా వారు విధులు నిర్వర్తించరు. అయితే ఇక్కడ మాత్రం రోజు వారీ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. డ్వామాలో ఈ పరిస్థితిని చూసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదెక్కడి చోద్యమో..!
కోట మండలానికి చెందిన సిబ్బందిని సస్పెండ్ చేసి ఆర్నెల్లవుతోంది. అయితే అతనితో నేటికీ పనులు చేయించుకుంటూ జీతాన్ని మాత్రం ఇవ్వడంలేదు. దగదర్తి, నెల్లూరు రూరల్, కలువాయి, మనుబోలులోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఒత్తిళ్లను తట్టుకోలేక మర్రిపాడు ఇన్‌చార్జి ఈసీకి ఇటీవల బీపీ పెరిగి ఆస్పత్రి పాలయ్యారు. ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోలేక.. అఽఽధికారుల ప్రెజర్‌ను తట్టుకోలేక ఉద్యోగులు, సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల వేళా అంతే..
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న వేళ బదిలీలు, డిప్యుటేషన్లు వేయకూడదనే నిబంధన ఉంది. అయితే క్షేత్రస్థాయిలో దీన్ని ఉల్లంఘిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లో లేక వీబీ – జీ రామ్ జీ పనులను వేగవంతం చేయాలనో బదిలీలు, డిప్యుటేషన్లు వేస్తున్నారు. గత నెల్లో నలుగుర్ని ఇలా మార్చారని తెలుస్తోంది.
డ్వామా కార్యాలయం
ఇక్కడంతా వింత ధోరణి
సస్పెండ్ చేస్తారు.. వేతనాలివ్వరు
యథావిధిగా విధులు నిర్వర్తించాల్సిందే
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా బదిలీలు, డిప్యుటేషన్లు
శ్రామికుల సంఖ్యను పెంచాలంటూ ఒత్తిళ్లు
శ్రామికులకు పనులను అధికంగా కల్పిస్తే దాని ఆధారంగా మెటీరియల్ కాంపొనెంట్ విడుదలవుతుంది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశముంటుంది. ఈ తరుణంలో వీబీ – జీ రామ్ జీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఇతర వర్కులకెళ్లే శ్రామికులు తక్కువ వేతనమొచ్చే పనులకు ఎలా వస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.


