● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి
గూడూరు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసి.. ఎలక్షన్ల ప్రక్రియను అపహాస్యం చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గూడూరు మున్సిపాల్టీకి సంబంధించి నిర్వహించనున్న ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. తనకెంతో రాజకీయ అనుభవముందని చంద్రబాబు తరచూ చెప్తుంటారని, అయితే దీన్ని అక్రమాలు, అరాచకాలకు పాల్పడేందుకే ఉపయోగించారని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఫలితాలను తారుమారు చేసేందుకు పలు ప్రాంతాల్లో యత్నించారని దుయ్యబట్టారు. నామినేషన్ల దశ నుంచే మహిళలను అవమానించడం, పత్రాలను చించేయడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
కౌంటింగ్‌లో అక్రమాలు
కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వోలు, పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చోట వరుసగా నాలుగుసార్లు కౌంటింగ్ చేసి, తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయేంత వరకు ఇలా వ్యవహరించాలంటూ సిబ్బందిని ఒత్తిళ్లకు గురిచేశారని ఆరోపించారు. పైనాపురంలో టాస్ అని చెప్పి, చివరికి పోస్టల్ బ్యాలెట్ సాకుతో ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారని ప్రకటించారని ఆరోపించారు. గురవయ్య ఇంటిపై దాడులు చేయడం, తమ పార్టీ నేతల గృహాల్లో మద్యం బాటిళ్లను పెట్టి అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగుతూ.. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కనబెడుతూ, ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులను సృష్టించినా.. అక్రమ కేసులు పెట్టినా.. తమ పార్టీ శ్రేణులు వెనుకడుగేసేదిలేదని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నిర్వహించిన ఎలక్షన్లలో విజేతలను అభినందించారు.


