ఆరోగ్యశ్రీలో అవినీతి ‘శ్రీ’ | Aarogyasri Trust has become a hotbed of irregularities | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో అవినీతి ‘శ్రీ’

Aug 22 2026 5:48 AM | Updated on Aug 22 2026 5:48 AM

Aarogyasri Trust has become a hotbed of irregularities

జిల్లాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల నెలవారీ టార్గెట్‌లు 

కీలక ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారులకు ఇవ్వాలని వసూళ్లకు తెరలేపిన ఓ అధికారి 

ఇటీవలే ఆ అధికారిని ట్రస్ట్‌లో తెచ్చిపెట్టిన కీలక ప్రజాప్రతినిధి 

సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అక్రమాలకు చిరునామాగా మారింది. 2024లో ప్రభుత్వం మారిన వెంటనే ‘ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌ (ఫిఫో)’ నిబంధనలను తుంగలో తొక్కి బంధువులు, అస్మదీయుల ఆస్పత్రులకు వేగంగా బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వ పెద్దలకు అక్రమాలకు బాట వేశారు. సందట్లో సడేమియా అన్నచందంగా ఇటీవల ట్రస్ట్‌లో తిష్టవేసిన ఓ అధికారి ఏకంగా జిల్లాల వారీగా టార్గెట్లు విధించి నెలవారీ అక్రమ వసూళ్ల విధానానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కీలక ప్రజాప్రతినిధికి, ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్లకు నెలవారీ వసూళ్లకు తెరలేపారు. నెలకు రూ.కోటి చొప్పున వసూళ్లే లక్ష్యంగా టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. 

రూ.3 లక్షల నుంచి.. రూ.5 లక్షల వరకు 
వైద్య శాఖతో సంబంధం లేని సదరు అధికారి సుదీర్ఘ పోరాటం చేసి ఇటీవలే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో తిష్ట వేశారు. ఉన్నతాధికారులు వద్దని వారించినా పట్టుబట్టి కీలక ప్రజాప్రతినిధి ఆ అధికారిని ట్రస్ట్‌లో నియమించారు. కాగా, అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని భుజానికి ఎత్తుకున్న ఆ అధికారి జిల్లాల్లో పనిచేసే నమ్మకస్తులైన కో–ఆర్డినేటర్లు, మేనేజర్ల ద్వారా వసూళ్ల తంతు కొనసాగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అధికంగా ఉన్న తిరుపతి, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు, విశాఖ వంటి జిల్లాలకు రూ.5 లక్షల చొప్పున, మిగిలిన జిల్లాలకు రూ.3 లక్షల చొప్పున ప్రతి నెలా పంపాలని హుకుం జారీ చేయడంతో కో–ఆర్డినేటర్లు లబోదిబోమంటున్నారు. ప్రతినెలా అంత మొత్తంలో ఇవ్వలేమంటూ కొందరు కో–ఆర్డినేటర్లు టార్గెట్‌లను తగ్గించి ఇచ్చేలా అంగీకరించినట్టు సమాచారం. బెంగళూరు, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని కో–ఆర్డినేటర్లకు సైతం వసూళ్ల టార్గెట్‌లు ఇచ్చినట్టు తెలిసింది.  

బ్యాంకర్లతో బెడిసికొట్టిన బేరసారాలు 
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, ఇతర కార్యక్రమాల అమలు కోసం బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ట్రస్ట్‌ డబ్బు డిపాజిట్‌ చేస్తుంది. ఈ క్రమంలో ట్రస్ట్‌ కార్యకలాపాల కోసం కొత్త బ్యాంక్‌ ఖాతా తెరవడానికి ఇటీవల ప్రైవేట్‌ బ్యాంకర్లతోనూ ప్రజాప్రతినిధి తాలూకా అధికారి బేరసారాలకు దిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో కొత్త ఖాతా తెరవడం కోసం పెద్ద మొత్తంలో బ్యాంకర్లను డబ్బు డిమాండ్‌ చేసినట్టు వెల్లడైంది. ఈ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా ఉన్నతాధికారికి తెలియడంతో సదరు అధికారి ప్లాన్‌ బెడిసికొట్టిందని ట్రస్ట్‌ ఉద్యోగులు చెబుతున్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ట్రస్ట్‌లో తిష్టవేస్తున్న అధికారులు అక్రమ సంపాదనే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ఆస్పత్రుల ఎంపానెల్‌మెంట్, బిల్లుల విడుదల, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇలా ప్రతిచోట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొద్ది నెలల కిందట ఓ పెద్ద ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి బిల్లులు మంజూరు పేరిట ట్రస్ట్‌ ఉద్యోగులు జరిపిన బేరసారాల ఆడియో కూడా కలకలం రేపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement