‘సర్‌’లో ఈ నాలుగైదు రోజులే కీలకం | Sajjala Ramakrishna Reddy gives direction to party ranks | Sakshi
Sakshi News home page

‘సర్‌’లో ఈ నాలుగైదు రోజులే కీలకం

Aug 22 2026 5:25 AM | Updated on Aug 22 2026 5:25 AM

Sajjala Ramakrishna Reddy gives direction to party ranks

అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చూసుకోండి 

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణల ప్రక్రియ(సర్‌)పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ సమన్వయకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్‌ పరిశీలకులు, రాష్ట్ర స్థాయి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు, అసెంబ్లీ పరిశీలకులతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ‘సర్‌లో ఈ నాలుగైదు రోజులే కీలకం. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలుకు నెలాఖరు వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నందున పార్టీ యంత్రాంగం వేగంగా పనిచేయాలి. అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలి. 

అభ్యంతరాలకు రసీదులు తీసుకుని రికార్డుగా భద్రపరచుకునేలా ఓటర్లను చైతన్యవంతులను చేయాలి. సర్‌లో రెండో విడత కార్యక్రమం దాదాపు పూర్తవుతున్నందున మ్యాపింగ్, నాన్‌ మ్యాపింగ్, గైర్హాజరు, చిరునామా మార్పులు, డూప్లికేట్, మరణించిన ఓటర్ల సమాచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాలుగైదు నెలలుగా బూత్‌ స్థాయిలో బీఎల్‌ఏలు చురుకుగా పనిచేయడం వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవడంలో మంచి పురోగతి సాధించాం. ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిన నేపథ్యంలో తొలగింపుల వివరాలను పార్టీ శ్రేణులు నిశితంగా పరిశీలించాలి. ఇప్పటికే వచ్చి న 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకం. 

అర్హులైన ఓట్లు తొలగించే పరిస్థితి ఉంటే సంబంధిత ఫారాలను సమర్పించి వాటిని తిరిగి జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలి. డూప్లికేట్‌ లేదా బోగస్‌ ఓట్లుగా భావించిన వాటిపై అవసరమైన అభ్యంతరాలను సమర్పించాలి.  పార్టీ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించిన సుమారు 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్‌ ఓట్లను బూత్‌ స్థాయిలో పరిశీలించాలి.  ఆగస్టు 27, 28 తేదీల నాటికి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసి, నెలాఖరు చివరి రెండు రోజుల్లో తుది పరిశీలనకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలి’ అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.   

ఎన్నికల సన్నద్ధతపై 25న జగన్‌ దిశానిర్దేశం   
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై పార్టీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని, పార్టీ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేలా శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని సజ్జల సూచించారు.  పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ఆగస్టు 25న కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ సమావేశంలో ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement