ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్‌.. వైఎస్‌ జగన్‌ సవాల్‌పై నోరు మెదపరేం? | CM Chandrababu and Lokesh did not respond for YS Jagans hallenge | Sakshi
Sakshi News home page

ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్‌.. వైఎస్‌ జగన్‌ సవాల్‌పై నోరు మెదపరేం?

Aug 22 2026 5:17 AM | Updated on Aug 22 2026 5:17 AM

CM Chandrababu and Lokesh did not respond for YS Jagans hallenge

గ్రూప్‌–1పై మేం రెడీ.. డీఎస్పీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? అంటూ చంద్రబాబు, లోకేశ్‌లకు వైఎస్‌ జగన్‌ సవాల్‌

సిద్ధమైతే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ఛాలెంజ్‌

వైఎస్‌ జగన్‌ ఛాలెంజ్‌ విసిరి 36 గంటలైనా స్పందించని సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌

డీఎస్సీ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే తండ్రీకొడుకులు మౌన ముద్ర దాల్చారంటోన్న డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు

లోకేశ్‌ను కాపాడుకోవాలన్న ఆరాటంతోనే గ్రూప్‌–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సర్వత్రా ఆగ్రహం

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒక నీతి.. లోకేశ్‌కు మరో నీతా? అని నిలదీత  

వైఎస్‌ జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సోషల్‌ మీడియాలో విష ప్రచారం

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి బట్టబయలు చేశారు. ఈ స్కామ్‌ నుంచి తన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ను కాపాడుకోవాలన్న ఆరాటంతో ఏపీపీఎస్సీ–2018 గ్రూప్‌–1 నియామకాలపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ సాక్ష్యాధారాలతో బహిర్గతం చేశారు. గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబు, లోకేశ్‌కు వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరారు. సిద్ధమైతే రెండింటిపై తక్షణమే సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ఛాలెంజ్‌ చేశారు. 

వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరి.. ఛాలెంజ్‌ చేసి 36 గంటలు గడిచినా అటు సీఎం చంద్రబాబుగానీ.. ఇటు మంత్రి లోకేశ్‌గానీ దానిపై నోరు మెదపడం లేదు. సవాల్‌ను స్వీకరిస్తున్నట్లుగానీ.. ఛాలెంజ్‌కు సిద్ధపడుతూ సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తామనిగానీ వారిద్దరూ ప్రకటించలేదు. డీఎస్సీ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే తండ్రీకొడుకులు ఇద్దరూ మౌన ముద్ర దాల్చారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యావేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ‘నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యత వహి­స్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. మరి అదే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్ర­బాబుకు, లోకేశ్‌కు మరో నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. 

అడ్డంగా దొరికిపోయిన తండ్రీ కొడుకులు 
» డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు, లోకేశ్‌ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి చూపుతూ వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ వైఎస్‌ జగన్‌ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. 

»  రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్‌ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ, ప్రశ్నల లీకేజీకి ద్వారాలు తెరిచిన వైనాన్ని వివరించారు. 

»  ‘డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారీ విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు తొలి ర్యాంక్‌ వచ్చి ందని చంద్రబాబు, లోకేశ్‌ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌ పేరు ఉంది. రెండో లిస్ట్‌లో నవీన్‌ పేరు తీసేశారు. ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చి న నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్‌ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది కాబట్టి. నవీన్‌కు ఉద్యోగమిస్తే గోల అవుతుంది కాబట్టి. అందువల్ల ముందస్తుగానే మెరిట్‌ లిస్ట్‌లో నవీన్‌ పేరు తొలగించారు. నవీన్‌ కోర్టుకు వెళ్లాడు. ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్‌ దగ్గరే ఆగిపోయిందా? లేక ఇంకా జరిగిందా?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

» చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేశ్‌ ఒప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ దీన్ని సమర్థించుకోవడానికి క్రీడాకారులకు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని.. పీవీ సింధుకు నేరుగా ఉద్యోగం ఇచ్చిన రీతిలోనే 372 టీచర్‌ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చామని చెప్పడాన్ని ఎత్తిచూపారు. వాళ్ల మనుషులకు టీచర్‌ ఉద్యోగాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారని.. పని పూర్తయిన తర్వాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారని చెప్పా­రు. 

ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారని.. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారని.. అంటే మళ్లీ గేట్లు మూసేశారని వివరించారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న ‘సాఫ్ట్‌బాల్‌’ అసోసియేషన్‌ నుంచి, అలాగే లోకేశ్‌ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్‌ అధ్యక్షుడిగా ఉన్న ‘జూడో’ అసోసియేషన్‌ నుంచి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్‌ కోటాలో పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. స్పోర్ట్స్‌ కోటా పేరిట టీచర్‌ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో చంద్రబాబు, లోకేశ్‌ ఒప్పుకున్నారని.. కానీ  బేరసారాలు జరిపిన వ్యక్తిని అరెస్టు కూడా చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. 

» వైఎస్‌ జగన్‌ సాక్ష్యాధారాలతో డీఎస్సీ కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో తండ్రీకొడుకులు అడ్డంగా దొరికిపోయారని.. తేలుకుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదని డీఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు.  

సోషల్‌ మీడియాలో విష ప్రచారం 
డీఎస్సీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ.. ఎన్నో కీలక డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ.. సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అంటూ వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరారు. 2018 గ్రూప్‌–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గ్రూప్‌–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. ఏకంగా గంటా 54 నిమిషాల పాటు సుదీర్ఘంగా వీటి గురించి వివరిస్తూ మాట్లాడారు. 

ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నేరుగా స్పందించకుండా ఎప్పటిలాగే టాపిక్‌ డైవర్షన్‌కు తెర తీశారు. ఇన్ని ముఖ్యమైన అంశాలపై స్పందించకుండా డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటే అన్నారంటూ నిస్సిగ్గుగా సోషల్‌ మీడియాలో తమకు అలవాటైన రీతిలో విష ప్రచారం చేస్తున్నారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. కళ్లెదుటే డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాలు కనిపిస్తుంటే వాటిపై స్పందించే దమ్ము, ధైర్యం లేక ఇలా పలాయన మంత్రం పఠిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement