‘టాటా పవర్’ బాటలో ‘వెబ్‌సోల్’
ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు బెదిరి బెంగాల్ వెళ్లిపోయిన ‘వెబ్‌సోల్’
వాటాల కోసం కీలక మంత్రి స్నేహితుడు, ప్రాజెక్టుల్లో భాగస్వామి వేధింపులు
నాయుడుపేట వద్ద రూ.3,538 కోట్లతో సోలార్ సెల్ యూనిట్‌కు ప్రతిపాదన
2025 నవంబర్ 15న ఏపీఈడీబీతో ఒప్పందం
జనవరిలో 123.45 ఎకరాలు కేటాయింపు.. రూ.2,212 కోట్ల రాయితీలిస్తూ ఉత్తర్వులు
జీవో ఇచ్చాక కంపెనీ కప్పం కట్టకపోవడంతో ఎనిమిది నెలలుగా ముందుకు పడని అడుగు
ప్రతిపాదనల ప్రకారం ఇప్పటికే నిర్మాణం పూర్తై యంత్ర పరికరాల బిగింపు చేపట్టాలి
కప్పం వసూళ్ల వేధింపులు తట్టుకోలేక వదిలేసి బెంగాల్ వెళ్లిపోయిన కంపెనీ
నెల వ్యవధిలో రాష్ట్రానికి 2 కంపెనీలు ‘టాటా’
రెండూ విద్యుత్తు రంగానికి చెందినవే
జీవోలు ఇచ్చిన తర్వాత వెళ్లిపోయిన ఏడో కంపెనీగా వెబ్‌సోల్ రికార్డు
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెళ్లిపోయిన 7 కంపెనీల పెట్టుబడుల విలువ రూ.16,428 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి మరో ‘పవర్’ కంపెనీ పారిపోయింది! నిన్న నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ పెట్టె బేడా సర్దుకొని ఒడిశాకు వెళ్లిపోగా తాజాగా తిరుపతి జిల్లా నాయుడు పేట నుంచి వెబ్‌సోల్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రానికి బైబై చెప్పేసి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక జీవోలు సైతం వెలువడిన అనంతరం ఏకంగా రూ.16,248 కోట్ల విలువైన ఏడు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టాటా పవర్, కోకోకోలా, వెబ్‌సోల్, అజాద్ మొబిలిటీ, జ్యూపిటర్, జినాఫ్రా, ఐస్పేస్ లాంటి ప్రముఖ సంస్థలు జీవోలు వెలువడిన తర్వాత ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు తట్టుకోలేక రాష్ట్రం నుంచి పారిపోవడం గమనార్హం.
ఇటు రాయితీలు.. అటు కప్పం వసూళ్లు!
నాయుడు పేట వద్ద రూ.3,538 కోట్లతో 4 గిగావాట్ల సోలార్ సెల్స్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన వెబ్‌సోల్ కప్పం కట్టలేక తాజాగా ఏపీ నుంచి నిష్క్రమించింది. వెబ్‌సోల్ యూనిట్ ఏర్పాటుకు 2025 నవంబర్ 15న ఏపీఈడీబీతో ఒప్పందం చేసుకోగా డిసెంబర్‌లో ఎస్‌ఐపీబీ ఆమోదం తెలపడం, 2026 జనవరి 10న జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. నాయుడుపేట వద్ద 123.45 ఎకరాల భూమిని కేటాయించి టైలర్‌మేడ్ రాయితీల కింద పెట్టుబడి విలువలో 69 శాతం వరకు సుమారు రూ.2,212 కోట్లు వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.
జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసి మిషనరీ బిగించే ప్రకియ మొదలు పెట్టి 2027 జూలై నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా వెబ్‌సోల్ ప్రణాళికలు కూడా రచించుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు విలవిల్లాడుతూ పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కంటే పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉన్నందున యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోతున్నట్లు వెబ్‌సోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా ఖైతాన్ పెట్టుబడిదారులతో నిర్వహించిన ఇన్వెస్టర్ కాల్‌లో ప్రకటించారు. సోలార్ విద్యుత్‌కు పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉందని, మూడు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాల్తాలోనే వెబ్‌సోల్ యూనిట్ స్థాపించనున్నట్లు ఖైతాన్ తెలిపారు.
రంగంలోకి ప్రభుత్వ పెద్దల సలహాదారుడు..!
ఏపీలో వెబ్‌సోల్ యూనిట్ ఏర్పాటుకు జీవో జారీ చేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఢిల్లీలో ఉంటున్న ఓ సలహాదారుడు నేరుగా రంగంలోకి దిగి కప్పం డిమాండ్ చేయడమే ఆ కంపెనీ బెంగాల్ వెళ్లిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సలహాదారుడు కీలక మంత్రికి స్నేహితుడే కాకుండా పలు విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండటంతో రాష్ట్రంలో నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన్ను కలిసిన తర్వాతే ఆమోదం లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. అడిగినంత కప్పం చెల్లించకుంటే జీవో విడుదలైనా పెట్టుబడుల ప్రతిపాదనలు ఒక్క కూడా అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. టాటా పవర్, వెబ్‌సోల్ ఎనర్జీ ఉదంతాలే దీనికి నిదర్శమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
నెల రోజుల్లో రెండు కంపెనీలు ‘టాటా’
రూ.కోట్ల విలువైన భూములు కేటాయించడమే కాకుండా టైలర్‌మేడ్ రాయితీల కింద పెట్టుబడిలో దాదాపు 70 శాతం వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కంపెనీలు మొహం చాటేయడంపై వ్యాపారవేత్తలు, అధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పక్క పక్క జిల్లాల నుంచి రూ.10,213 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులు అది కూడా నెల రోజుల వ్యవధిలో రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం.. రెండూ విద్యుత్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. నెల్లూరు క్రిబ్‌కో సెజ్‌లో టాటా పవర్‌కు 250 ఎకరాలు కేటాయించిన తర్వాత ఏపీ కంటే ఒడిశానే బెస్ట్ అని టాటాపవర్ పర్వీర్‌సిన్హా ప్రకటించగా... తాజాగా ఏపీ కంటే పశ్చిమ బెంగాల్ పెట్టుబడులకు అనువుగా ఉందంటూ వెబ్‌సోల్ ఈడీ సంజనా ఖైతాన్ సైతం స్పష్టం చేయడం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.


