సాక్షి,తాడేపల్లి: ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి కన్నుమూతపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి గారు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించడంతో పాటు, తదనంతరం తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.
భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారు జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
👉ఇదీ చదవండి: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత


