‘డైవర్షన్‌ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’ | Gadikota Srikanth Reddy Challenge To Chandrababu Over Viveka Case | Sakshi
Sakshi News home page

‘డైవర్షన్‌ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’

Aug 21 2026 3:13 PM | Updated on Aug 21 2026 3:19 PM

Gadikota Srikanth Reddy Challenge To Chandrababu Over Viveka Case

సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్‌ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు.

ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో  ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

అంతా డైవర్షన్‌ పాలిటిక్స్‌:
డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో గ్రూప్‌-1 అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు కదా.. వాటిపై సీబీఐ విచారణకు మేము సిద్ధం. మరి మీ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి అరాచకాలు పెరిగిపోతుంటే, యువత తప్పుదోవ పడుతుంటే దానిపై మాట్లాడకుండా ఎందుకు డైవర్షన్‌ చేస్తున్నారు?

న్యాయం కోసం శాంతియుతంగా వీల్‌చైర్‌లో యాత్ర చేస్తున్న సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు హింసించారు? ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడి హిట్‌ అండ్‌ రన్‌ ఘటనపైనా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే అవినాష్‌ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలను ఏదో సాధించినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.

వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీకి సవాల్‌:
వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిట్‌ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ట్రయల్‌ జరగాలి అంటుంటే.. ట్రయల్‌ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేసు ట్రయల్‌ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సీబీఐ విచారణ జరిగింది. కేసు కోర్టుల పరిధిలో ఉంది. నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి. ట్రయల్‌ జరగడానికి మీకు అభ్యంతరం ఏమిటి?

చంద్రబాబుకి సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లూథ్రాయే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి తరఫున కూడా వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బుతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ, కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విచారణ జరపండి.. ట్రయల్‌ జరపండి.. నిజాలు ప్రజల ముందుకు రానివ్వండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సుగాలి ప్రీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసైనా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఫాల్స్‌ ప్రాపగండా, ఫాల్స్‌ నేరేటివ్, డైవర్షన్‌ రాజకీయాలు మానండి. వ్యవస్థలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా విచారణ జరగనివ్వండి. మీ మీడియా శక్తితో ఎంత ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు. వివేకానంద రెడ్డి మా మనిషి. దివంగత వైఎస్సార్‌ సోదరుడు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు. ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలి. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి. విచారణ జరగాలి. నిజం ప్రజల ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement