సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన హైదరాబాద్, కడప ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా సాగుతున్న వివేకా హత్య కేసులో మరో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి రావడంపై రాజకీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల పేరుతో కూటమి ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెర తీసిందా?అనే చర్చ జోరందుకుంది. .
వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ఏపీ, తెలంగాణలో పది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో రెండు, వైఎస్సార్ జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్‌తో పాటు శంకర్‌రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. అటు పులివెందులలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇంతకీ ఈడీ ఎందుకు?
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి ఇప్పటికే చార్జ్‌షీట్లు, అనుబంధ చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. 2026 మార్చిలో సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది మూడో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలైనట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు అవసరం లేదన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన మరింత దర్యాప్తు కోరిన పిటిషన్‌ను పక్కన పెట్టింది. ఇలాంటి సమయంలో వివేకా హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
‘మళ్లీ ఇదేంటి?’
వివేకా హత్య కేసు ఇప్పటికే సుదీర్ఘకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు కేంద్రంగా ఉంది. సీబీఐ దర్యాప్తు, చార్జ్‌షీట్లు, కోర్టు విచారణల తర్వాత ఇప్పుడు ఈడీ సోదాలు జరగడంతో.. ఇదే కేసును మరో కోణంలో మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వివేకా హత్య కేసు.. మళ్లీ ఫోకస్‌లోకి
2019 మార్చిలో పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం సీబీఐకి కేసు అప్పగించారు. 2020లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2021లో తొలి చార్జ్‌షీట్, ఆ తర్వాత అనుబంధ చార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని 2022లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. విచారణ ముగించామని, ఇంక లోతైన దర్యాప్తేదీ అవసరం లేదని చెప్పినా.. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది.
ఇదీ చదవండి: దమ్ము లేని ప్రభుత్వమిది


