అందరికీ ఇళ్లు ఇస్తాం | House construction program launched as a pilot project in Burripalem Tenali constituency | Sakshi
Sakshi News home page

అందరికీ ఇళ్లు ఇస్తాం

Oct 5 2026 3:55 AM | Updated on Oct 5 2026 3:55 AM

House construction program launched as a pilot project in Burripalem Tenali constituency

బుర్రిపాలెంలో ‘పేదలకు పట్టాభిషేకం’లో సీఎం చంద్రబాబు 

సూపర్‌సిక్స్‌ సహా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం 

తెనాలి/సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ నాయకత్వంలో తాను, పవన్‌కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గ్రామీణ్‌ 2.0 పథకం కింద రాష్ట్రంలో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో పైలట్‌ ప్రాజెక్టుగా సీఎం ప్రారంభించారు.  175 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పట్టాభిషేకం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 

60–70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పేదల సమస్యలను పరిష్కరిస్తున్నామని విశాఖ, విజయవాడ, మంగళగిరిల్లో పైసా ఖర్చు లేకుండా 60 వేలమంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. వీటి విలువ రూ.52 వేల కోట్లుగా ఉంటుందని, ప్రతి పేదవాడికి రూ.కోటి విలువైన ఇంటి జాగా ఇచ్చి కోటీశ్వరులను చేసిన ఘనత ఎన్‌డీఏ ప్రభుత్వానిదని చెప్పారు. నిబంధనల ప్రకారం రాష్ట్రానికి 75 వేల ఇళ్లు మంజూరైతే అడిగిన వెంటనే కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మూడు లక్షల ఇళ్లను ఇచ్చారన్నారు. రాబోయే ఆరు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లను, వచ్చే సంవత్సరం మరో మూడు లక్షల ఇళ్లను ఇస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2029 లోపు నూటికి నూరుశాతం అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు.  

మార్చి నాటికి భూముల సర్వే పూర్తి 
2019–24 మధ్య రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం జరిగిందని,  పేదలకిచ్చిన ఆరు లక్షల ఇళ్లను రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. భూసేకరణలో పెద్దఎత్తున అవినీతి చేశారన్నారు. పేదలకిచి్చన ఇళ్లు నివాసయోగ్యం కాదన్నారు. 2014–19లో తాము 17 లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేసి 8 లక్షలు పూర్తి చేశామన్నారు. భూముల రీ సర్వే మార్చి నాటికి పూర్తిచేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా చేస్తామని చంద్రబాబు చెప్పారు. సూపర్‌ సిక్స్‌ ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు.  

సమయం, వ్యయం తగ్గుతుంది: చౌహాన్‌ 
3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణ సమయం, వ్యయం తగ్గుతుందని తక్కువ మానవ వనరులతో పూర్తి చేయవచ్చన్నారు. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 

ప్రకృతి సాగును మోదీ ప్రోత్సహిస్తున్నారు 
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో జానకిరామ్‌ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్రమంత్రి చౌహాన్‌ సందర్శించారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న రైతును అభినందించారు. 

కాగా.. అంతకుముందు సీఎం చంద్రబాబును ఉండవలిల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి కలిశారు. ఈ సందర్భంగా రెండు వేర్వేరు లేఖలను చంద్రబాబు అందించారు. రైతులను ఆదుకునేందుకు, పేదల ఇళ్ల నిర్మాణానికి అదనపు నిధులు ఇవ్వాలని ఆ లేఖల్లో సీఎం కోరారు. ఖరీఫ్‌–2026కి సంబంధించి పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలని  కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement