విశాఖపట్నం: సురక్షిత నగరంగా పేరున్న విశాఖ ఇప్పుడు అర్ధరాత్రి భయం గుప్పిట్లోకి జారుతోందన్న ఆందోళన పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యూబా పబ్‌లో మద్యం సేవించిన రెండు యువకుల గ్రూపుల మధ్య డీజే సౌండ్, డ్యాన్స్ విషయంలో తోపులాట మొదలైంది. బౌన్సర్లు వారిని బయటకు పంపడంతో గొడవ రోడ్డుపైకి చేరింది. యువకులు బీర్ బాటిళ్లు, హెల్మెట్లు, కర్రలతో సుమారు 20 నిమిషాలు దాడి చేసుకున్నారు. ఇద్దరికి తలలపై తీవ్ర గాయాలవగా, వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందాక పోలీసులు అరగంట ఆలస్యంగా వచ్చారన్న విమర్శలున్నాయి.
వరుస ఘటనలు : గత 15 రోజుల్లో త్రీ టౌన్, సిరిపురం, ఆర్.కె. బీచ్ రోడ్డు పరిధిలో ఇలాంటివే పలు ఘటనలు జరిగాయి. బీచ్ రోడ్డులో కార్ రేసింగ్‌లో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ గాయపడ్డాడు. ఓ పబ్ వద్ద యువతిపై అసభ్య ప్రవర్తన జరిగింది. వైఎంసీఏ వద్ద ఐదుగురు యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో రాత్రి 10 గంటల తర్వాత బయటకు రావడానికి కుటుంబాలు భయపడుతున్నాయి.
నిబంధనల ఉల్లంఘన : ప్రభుత్వ నిబంధనల ప్రకారం పబ్బులు రాత్రి 12 గంటల వరకే నడపాలి. కానీ క్యూబా సహా అనేక పబ్బులు తెల్లవారుజామున 2 గంటల వరకు నడుస్తున్నాయి. ఎక్సైజ్, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమని ఆరోపణలున్నాయి. పబ్బుల వద్ద మహిళా పోలీసుల నిఘా లేదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయని పలువురు చెబుతున్నారు.
ఈవెంట్ల పేరుతో వల : నిర్వాహకులు ‘లేడీస్ నైట్’, ‘కపుల్ నైట్’, ‘సింగిల్స్ నైట్’, ‘మింగిల్ నైట్’ వంటి ఈవెంట్లను ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లలో భారీగా ప్రచారం చేస్తున్నారు. 20–25 ఏళ్ల కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే వీరి లక్ష్యం. యువత దారి తప్పుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్లకు ఆశపడి పోలీసు అధికారులు ఇలాంటి ఈవెంట్లకు అనుమతులిస్తున్నారని ఆరోపణలున్నాయి.
సీపీ జోక్యం చేసుకోవాలి పోలీస్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని, అన్ని పబ్బులకు నోటీసులు ఇచ్చి, రాత్రి తనిఖీలు ముమ్మరం చేయాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. లేకపోతే విశాఖ కూడా బెంగళూరు, హైదరాబాద్ తరహాలో పబ్ సంస్కృతి నేరాలకు అడ్డాగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
కేసు నమోదు చేశాం
గాయపడిన వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం. గొడవ సమాచారం అందిన వెంటనే పోలీసులను పంపాం. పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. బీచ్‌రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నాం.
–ఎల్. అప్పలనాయుడు, త్రీ టౌన్ సీఐ
విశాఖలో నడిరోడ్డుపై మద్యం మత్తులో యువకుల వీరంగం బీచ్ రోడ్డులోని క్యూబా పబ్ వద్ద యువకుల మధ్య ఘర్షణ, ఒకరిపైఒకరు దాడి.. ఇద్దరు యువకులకు గాయాలు https://t.co/5uopBqsy2I
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026


