‘వాడితో ఎందుకు మాట్లాడావ్.. వీడితో ఎందుకు మాట్లాడుతున్నావ్.. దేవుడి మండపం దగ్గర డ్యాన్సులు వేస్తున్నావేంటి.. బ్లేడుతో కోసేస్తా.. నేను కోసేసుకుంటా అంటున్నాడు.. నన్ను కొడుతున్నాడు.. నీచంగా మాట్లాడుతున్నాడు.. నాకు చాలా భయంగా ఉంటుంది.. ఏదో ఒకరోజు వాడు నన్ను చంపేస్తాడేమో..’ ఇది ప్రేమోన్మాది చిన్నా చేతిలో శనివారం హతమైన మహాలక్ష్మి తన మరదలు మేఘనతో గత నెల రోజుల నుంచి చేస్తున్న సంభాషణ. తనకు ప్రేమ పేరుతో దగ్గరైన మంకు చిన్నారావు అలియాస్ చిన్నా చేష్టలతో విసిగిపోయిన ఆమె ప్రతిరోజూ పడిన బాధలు వర్ణణాతీతంగా కనిపిస్తున్నాయి. న్యూరాజరాజేశ్వరీపేటలో జరిగిన ఈ ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వేరే వారికి దక్కకూడదని..
మహాలక్ష్మి వేరే ఎవరితోనో మాట్లాడుతోందని.. అందుకే తనతో మాట్లాడడం లేదని.. పెళ్లిచేసుకోడానికి నిరాకరిస్తుందని భావించిన చిన్నారావు.. నాకు దక్కని మహాలక్ష్మిని ఎవరికి దక్కనీయకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకా రం ముందురోజే కొబ్బరికాయలు నరికే కొడవలిని సిద్ధం చేసుకొని మహాలక్ష్మి ఇంటి సమీపంలో మాటు వేసి, నానమ్మ బయటకు వెళ్లిన సమయంలో ఆమె గొంతు కోసేసి అత్యంత కిరాతకంగా హతమర్చాడు. మహాలక్ష్మి కేకలు వినిన స్థానికులు ఇంటి వద్దకు వచ్చి తలుపులు పగలకొట్టే ప్రయత్నం చేశారు. దీంతో చిన్నా ఆ ఇంటి వెనుక తలుపు తీసుకొని అదే భవనం పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నా ఫోన్ కాల్ డేటాతో పాటు అతను కత్తి ఎక్కడ నుంచి తెచ్చాడు. అతనికి ఎవరైనా సహకరించారా.. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశాంతంగా అంత్యక్రియలు..
మహాలక్ష్మి, చిన్నారావు ఇళ్లు రెండూ సమీపంలోనే ఉండటంతో పోలీసులు వారి ఇళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటుచేశారు. ఎటువంటి గొడవలు, కొట్లాటలు చోటుచేసుకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో వారి అంత్యక్రియలు జరిగాయి.
స్వచ్ఛమైన ప్రేమను కోరుకోవడమే శాపమైంది!
పడవల మహాలక్ష్మి(19) పుట్టిన రెండేళ్లలోపే తల్లిదండ్రుల మధ్య విభేదాలు రావడంతో ఆమె తల్లి తనను వదిలి వెళ్లిపోయింది. తండ్రి కూడా ఆమెను తన నాన్నమ్మ శాంతమ్మ దగ్గర వదిలి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలను నోచుకోని మహాలక్ష్మి అనేక కష్టాల సుడిగుండాల మధ్య పెరిగింది. బాల్యం ఎలా గడిచినా కనీసం తన వివాహ బంధమైన అందంగా ఉండాలని.. పెళ్లి తరువాత భర్త ప్రేమ ఆప్యాయతల మధ్య హాయిగా బతకాలని ఆశించింది. అలా ఆ యువతి కన్న కలలే ఆమె పాలిట యమపాశమైంది. ప్రేమ పేరుతో తనకు దగ్గరైన చిన్నారావు కొన్ని నెలలకే ఆమెను వేధించడం, అతనిలో దాగి ఉన్న సైకో లక్షణాలు ఒక్కొక్కటిగా బయట పెడుతుండటంతో అవి చూసి ఆమె వణికిపోయింది. తాను కన్న కలల కోట కళ్లముందే కన్నీళ్లపాలవుతుంటే సహించలేకపోయింది. ‘ఇలా అయితే నీతో నేనుండలేను.. ఇప్పటి వరకూ నేను పడినా కష్టాలు చాలు.. ఇంకా మిగిలిన బతుకంతా నీతో కష్టాలు పడలేను’ అని మనసులో మాట చెప్పింది.
మరింతగా పగబట్టి..
ఆమె మాటలేవి తలకెక్కించుకోని చిన్నా నువ్వు ఎవరితో మాట్లాడానికి వీలులేదు.. షాపునకు వెళ్లొద్దు.. అంటూనే ఇంటి దగ్గర వారితో.. పనిచేసే దుకాణం వద్ద వారితో సంబంధాలు అంటకట్టాడు. ఆమెకు ఫోన్లు చేసి వేధించడమే కాకుండా నువ్వు నా మాట వినకపోయినా.. నేను చెప్పినట్లు చేయకపోయినా చంపేస్తానని రోడ్డుపై ఇష్టం వచ్చినట్లుగా కొట్టే వాడని మహాలక్ష్మి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో అతడి చేష్టలతో విసిగిపోయిన మహాలక్ష్మి అప్పటినుంచి చిన్నా ఫోన్లు ఎత్తకుండా, అతనితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటోంది. ఈ క్రమంలో చిన్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి.. లేకపోతే బ్లేడుతో కోసేసుకుంటా.. చచ్చిపోతా.. నిన్ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిపోయిన మహాలక్ష్మి విషయాన్ని నాన్నమ్మ శాంతమ్మకు, మరదలు మేఘనకు, తన తండ్రికి, బంధువులకు చెప్పడంతో వారు చిన్నా కుటుంబ సభ్యులకు విషయాన్ని వివరించి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. మహాలక్ష్మి జోలికి రావద్దని ఒప్పందం కుదుర్చుకున్నా ఫలితం లేకపోయింది.
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్):
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి


