వైఫల్యాలపై ప్రశ్నిస్తే పలాయనం చిత్తగిస్తోంది
డీఎస్సీ, గ్రూప్–1పై సభలో చర్చిద్దాం రండి అంటే పారిపోతున్నారు
బయట మాత్రం డాంబికాలు పలుకుతారు
డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి
రాష్ట్రంలో గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారు
ఈ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదు
శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, అరాచకాలపై అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యంలేక అధికారపక్షం పలాయనం చిత్తగిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారని అన్నారు.
సాక్షాత్తూ పోలీసుల కారులోనే గంజాయి పట్టుబడిందని, ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఎస్పీ, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను వదిలేసి కిందిస్థాయి వారిపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి అనేది చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని చెప్పారు. అమరావతిలో కొత్తగా వారు చేసిందేమీలేదని, ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరే మళ్లీ టెంట్లు వేసి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రోజంతా చర్చిద్దామన్నాం..
డీఎస్సీలో అక్రమాలు, గ్రూప్ – 1 అంశాలపై సభలో రోజంతా చర్చిద్దామని, అవసరమైతే మరో రెండు రోజులు సభను పొడిగించాలని తాము డిమాండ్ చేస్తే పారిపోయారని, పైగా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని బొత్స తెలిపారు. బయటకొచ్చి మాత్రం ప్రతిపక్షంపై బురదజల్లుతూ డాంబికాలు పలుకుతారని అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా 1.30 లక్షల సచివాలయ పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో 10,300కు పైగా టీచర్ పోస్టుల భర్తీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 1998 డీఎస్సీలో మిగిలిపోయిన 5,887 మందికి, 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. 2019 స్పెషల్ డీఎస్సీ ద్వారా 521 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేజీబీవీల్లో 1,250 మంది క్వాలిఫైడ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించామని, ట్రిపుల్ ఐటీలో 450 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మొత్తంగా ఉపాధ్యాయ రంగంలో 10,300కు పైగా ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అలాగే 2024 ఫిబ్రవరి 12న 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటించామని, ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. మరి వైఎస్సార్‌సీపీ హయాంలో 16 వేల పోస్టులు ఇవ్వలేదని ఎలా చెబుతున్నారని, దీంట్లో ఏది అబద్ధమో సభలో నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు.
విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తున్నారు
పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్, జగనన్న గోరుముద్ద లాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారని బొత్స చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ లేకుండా కఠిన చట్టాలు తెచ్చామన్నారు. ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ
చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, లక్షలాది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల వైపు నెడుతున్నారని చెప్పారు. సగం మంది తల్లులకు అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వ మోసాలు, అరాచకాలను వదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో’నే తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.


