AI Pic
సాక్షి, విజయవాడ: ఓ యువతితో సన్నిహితంగా ఉన్న న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై విజయవాడ నగరానికి చెందిన యువతి కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి వెలుగు చూసింది. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన ఓ యువతి గతంలో హైదరాబాద్‌లో కోచింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ అవనిగడ్డకు చెందిన ఎం. నిఖిల్‌తో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమకు దారి తీసింది. అప్పట్లో వారు సన్నిహితంగా మెలిగారు. వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రియుడు భద్రపరచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత యువతికి పెళ్లి అయింది. ఆమె విజయవాడలోనే భర్తతో ఉండేది. ఆమెకు పెళ్లయినా కూడా ప్రియుడి వేధింపులు ఆగలేదు. తనను వదిలి పెట్టాలని ఎంత చెప్పినా వినకుండా కలవాలంటూ అతను ఆమెను వేధించేవాడు. అంతటితో ఆగకుండా ఫొటోలు, వీడియోలను నిఖిల్ సోషల్ మీడియాలో పెట్టాడు.
ఏకంగా భర్తకే వీడియోలు పంపి బ్లాక్ మెయిల్..
అవనిగడ్డకు చెందిన ఆ యువకుడు తనను కలవట్లేదనే అక్కసుతో ఏకంగా ఆమె భర్తకు యువతితో కలిసి ఉన్న న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపాడు. తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక సదరు యువతిని భర్త వదిలేశాడు. గత నెల రోజులుగా తనను కలవాలంటూ యువతిని నిఖిల్ వేధింపులకు గురి చేశాడు. విషయాన్ని బాధిత యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఈ నేపథ్యంలోనే సదరు యువతి పథకం ప్రకారం నిఖిల్‌ను ఆదివారం విజయవాడకు రప్పించింది. ఆదివారం రాత్రి పీవీపీ మాల్ సమీపంలో నిఖిల్ ఉండగా అప్పటికే వేచి ఉన్న సదరు యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. అక్కడే ఉన్న స్థానికులు వారిస్తున్నా విచక్షణ రహితంగా దాడి చేశారు. స్థానికుల సమాచారంతో మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నిఖిల్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


