ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత | Veteran Actress Sowcar Janaki Passes Away At 94 After Seven Decade Film Career | Sakshi
Sakshi News home page

Sowcar Janaki Death: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

Aug 21 2026 2:49 PM | Updated on Aug 21 2026 3:22 PM

Veteran Actress Sowcar Janaki Die

దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీనియర్‌ నటి షావుకారు జానకి(94) తీవ్ర అనారోగ్యంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కథానాయికగా, ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన ఆమె.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. షావుకారుతో మొదలైన ఆమె నట ప్రస్థానం.. వందలాది పాత్రలతో సాగి.. దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. ఆమె మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి.  

రాజమండ్రిలో జననం..
1931 డిసెంబరు 12న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిన జానకి అసలు పేరు శంకరమంచి జానకి. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆమె రేడియో నాటికల ద్వారా తన కళా ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా కథానాయికగా ఎదిగారు.

‘షావుకారు’తో గుర్తింపు
దర్శకుడు ఎల్‌.వి. ప్రసాద్‌ తెరకెక్కించిన ‘షావుకారు’ (1950) చిత్రంతో జానకి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్రతో ‘షావుకారు జానకి’గా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌తో..
తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన జానకి.. తమిళంలో ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ తదితర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ‘రోజులు మారాయి’, ‘కన్యాశుల్కం’, ‘జయం మనదే’, ‘పాండురంగ మహత్యం’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెలు’, ‘బడిపంతులు’, ‘సంసారం ఒక చదరంగం’ తదితర చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. ఇలా ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో షావుకారు జానకి దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించారు.

ప్రతిష్ఠాత్మక పురస్కారాలు
నటనకు గాను జానకి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నంది పురస్కారాలు, ఇతర జీవిత సాఫల్య పురస్కారాలు ఆమెను వరించాయి. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement