టైటిల్: ‘అమీర్ లోగ్
నటీనటులు:ఎంసీ హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
నిర్మాణ సంస్థ: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
దర్శకుడు: రమణారెడ్డి సోమ
సంగీతం: స్మరణ్ సాయి
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
విడుదల తేది: ఆగస్ట్ 21, 2026
కథేంటంటే..
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన శ్రీను(హరి మున్నంగి), మల్లేష్(శశిధర్ కొచ్చర్ల కోట), రఫీక్(మనోజ్ ఆవుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకుండా, ఏ పని లేకుండా బస్తీలో అల్లరి చేస్తూ తిరగడం వాళ్లకు అలవాటు. క్రికెట్ గ్రౌండ్ విషయంలో గొడవలు పడటం, ఇంట్లో తల్లిదండ్రుల చేత తిట్లు తినడం.. ఇలా వాళ్ల జీవితం సరదాగా సాగిపోతుంటుంది. వాళ్లకు అక్కలా ఉండే గీత(వేద జలంధర్) మాత్రం ఎప్పటికప్పుడు మంచి చెడు చెబుతుంటుంది.
ఆమె పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో శ్రీనుకు ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. మొదట్లో స్నేహితులిద్దరూ శ్రీనును ఆటపట్టించినా.. ఆ తర్వాత వాళ్లు కూడా తమకు నచ్చిన పనులను ఎంచుకుంటారు. రఫీక్ బైక్ మెకానిక్‌గా, మల్లేష్ క్యాబ్ డ్రైవర్‌గా సెటిల్ అవుతారు. అయితే ఓ రోజు శ్రీను ఆఫీస్‌లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో.. క్రికెట్ విషయంలో శ్రీను బెట్టింగ్ కడతాడు. పాతబస్తీ పోరగాళ్లు, సాఫ్ట్ వేర్ టీమ్‌లు కలిసి క్రికెట్ ఆడతారు. ఇందులో పాతబస్తీ పోరగాళ్లు ఓడిపోతారు. అయితే బెట్టింగ్ డబ్బులు తీసుకోకుండా.. బిర్యానీ పార్టీ ఇవ్వమని సాఫ్ట్‌వేర్ టీమ్ అడుగుతుంది. దీంతో పాతబస్తీకి చెందిన చాచాని బ్రతిమిలాడి బిర్యానీ వండించి..వాళ్లకు పార్టీ ఇస్తారు. చాచా వండిన బిర్యానీ తిని సాఫ్ట్ వేర్ బ్యాచ్ ఫిదా అవుతారు. అది చూసి టీమ్ హెడ్ రవికి బిర్యానీ పాయింట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఈ ముగ్గురుతోనే `కిర్రాక్ బిర్యానీ` పాయింట్ స్టార్ట్ చేస్తాడు. మరి ఈ బిర్యానీ బిజినెస్ సక్సెస్ అయ్యిందా? రవిలో వచ్చిన మార్పేంటి? చివరికి బిర్యానీ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘అమీర్ లోగ్’లో కథ కంటే హైదరాబాద్ పాతబస్తీ నేటివిటీనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్థానిక యాస, జీవన విధానం, స్నేహితుల మధ్య సరదా గొడవలు, కామెడీ.. ఇవన్నీ సినిమాకు ఒక సహజమైన ఫీల్‌ను తీసుకొచ్చాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకుడు దాన్ని హైదరాబాద్ బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ, వారి జీవితాల్లో వచ్చే మార్పులు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చేయడానికి కొంత ఎక్కువ సమయం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ దగ్గర నుంచి కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్‌లో స్నేహం, భావోద్వేగాలు, కామెడీని కలిపి కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బిర్యానీ చుట్టూ కథను మలుపులు తిప్పడం సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చింది. అయితే కొన్ని సన్నివేశాలను మరింత కుదించి , స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు రమణారెడ్డి సోమ ఎంచుకున్న కథ బాగుంది కానీ , దాన్ని ఆకట్టుకునేలా, కమర్షియల్‌గా మెప్పించేలా చేయడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు.
ఎవరెలా చేశారంటే..
శ్రీను పాత్రలో ఎంసీ హరి, మల్లేష్‌గా శశిధర్, రఫీక్‌గా మనోజ్ తమ పరిధిలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కొత్త నటులైనా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా స్నేహితులుగా కలిసి కనిపించే సన్నివేశాల్లో వారి కాంబినేషన్ సినిమాకు ప్లస్‌గా నిలిచింది. గీత పాత్రలో వేద జలంధర్ స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ, కథలో హీరోల జీవితాలను మార్చే కీలకమైన పాత్రగా కనిపిస్తుంది. చాచా పాత్రలో విశ్వేందర్ రెడ్డి భావోద్వేగాలను చక్కగా పలికించారు. రావణ్ నిట్టూరు, సాయి యోగి తదితరులు తమకు పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. పాటలు పాత బస్తీ జీవితాలను ఆవిష్కరించేలా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ రోహిత్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మాధవి రెడ్డి సోమ నిర్మాణ విలువలు పర్వాలేదు.


