breaking news
Ameer Log Movie
-
‘అమీర్ లోగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘అమీర్ లోగ్నటీనటులు:ఎంసీ హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులునిర్మాణ సంస్థ: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్నిర్మాత: మాధవి రెడ్డి సోమదర్శకుడు: రమణారెడ్డి సోమసంగీతం: స్మరణ్ సాయిఎడిటర్: రోహిత్ పెనుమత్సవిడుదల తేది: ఆగస్ట్ 21, 2026కథేంటంటే..హైదరాబాద్ పాతబస్తీకి చెందిన శ్రీను(హరి మున్నంగి), మల్లేష్(శశిధర్ కొచ్చర్ల కోట), రఫీక్(మనోజ్ ఆవుల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకుండా, ఏ పని లేకుండా బస్తీలో అల్లరి చేస్తూ తిరగడం వాళ్లకు అలవాటు. క్రికెట్ గ్రౌండ్ విషయంలో గొడవలు పడటం, ఇంట్లో తల్లిదండ్రుల చేత తిట్లు తినడం.. ఇలా వాళ్ల జీవితం సరదాగా సాగిపోతుంటుంది. వాళ్లకు అక్కలా ఉండే గీత(వేద జలంధర్) మాత్రం ఎప్పటికప్పుడు మంచి చెడు చెబుతుంటుంది. ఆమె పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీలో శ్రీనుకు ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. మొదట్లో స్నేహితులిద్దరూ శ్రీనును ఆటపట్టించినా.. ఆ తర్వాత వాళ్లు కూడా తమకు నచ్చిన పనులను ఎంచుకుంటారు. రఫీక్ బైక్ మెకానిక్‌గా, మల్లేష్ క్యాబ్ డ్రైవర్‌గా సెటిల్ అవుతారు. అయితే ఓ రోజు శ్రీను ఆఫీస్‌లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో.. క్రికెట్ విషయంలో శ్రీను బెట్టింగ్ కడతాడు. పాతబస్తీ పోరగాళ్లు, సాఫ్ట్ వేర్ టీమ్‌లు కలిసి క్రికెట్ ఆడతారు. ఇందులో పాతబస్తీ పోరగాళ్లు ఓడిపోతారు. అయితే బెట్టింగ్ డబ్బులు తీసుకోకుండా.. బిర్యానీ పార్టీ ఇవ్వమని సాఫ్ట్వేర్ టీమ్ అడుగుతుంది. దీంతో పాతబస్తీకి చెందిన చాచాని బ్రతిమిలాడి బిర్యానీ వండించి..వాళ్లకు పార్టీ ఇస్తారు. చాచా వండిన బిర్యానీ తిని సాఫ్ట్ వేర్ బ్యాచ్ ఫిదా అవుతారు. అది చూసి టీమ్ హెడ్ రవికి బిర్యానీ పాయింట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఈ ముగ్గురుతోనే `కిర్రాక్ బిర్యానీ` పాయింట్ స్టార్ట్ చేస్తాడు. మరి ఈ బిర్యానీ బిజినెస్ సక్సెస్ అయ్యిందా? రవిలో వచ్చిన మార్పేంటి? చివరికి బిర్యానీ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..‘అమీర్ లోగ్’లో కథ కంటే హైదరాబాద్ పాతబస్తీ నేటివిటీనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్థానిక యాస, జీవన విధానం, స్నేహితుల మధ్య సరదా గొడవలు, కామెడీ.. ఇవన్నీ సినిమాకు ఒక సహజమైన ఫీల్‌ను తీసుకొచ్చాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకుడు దాన్ని హైదరాబాద్ బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ, వారి జీవితాల్లో వచ్చే మార్పులు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయం చేయడానికి కొంత ఎక్కువ సమయం తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ దగ్గర నుంచి కథలో వేగం పెరుగుతుంది. సెకండాఫ్‌లో స్నేహం, భావోద్వేగాలు, కామెడీని కలిపి కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బిర్యానీ చుట్టూ కథను మలుపులు తిప్పడం సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చింది. అయితే కొన్ని సన్నివేశాలను మరింత కుదించి , స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు రమణారెడ్డి సోమ ఎంచుకున్న కథ బాగుంది కానీ , దాన్ని ఆకట్టుకునేలా, కమర్షియల్‌గా మెప్పించేలా చేయడంలో మాత్రం కొంతవరకే సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే..శ్రీను పాత్రలో ఎంసీ హరి, మల్లేష్‌గా శశిధర్, రఫీక్‌గా మనోజ్ తమ పరిధిలో సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. కొత్త నటులైనా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా స్నేహితులుగా కలిసి కనిపించే సన్నివేశాల్లో వారి కాంబినేషన్ సినిమాకు ప్లస్‌గా నిలిచింది. గీత పాత్రలో వేద జలంధర్ స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ, కథలో హీరోల జీవితాలను మార్చే కీలకమైన పాత్రగా కనిపిస్తుంది. చాచా పాత్రలో విశ్వేందర్ రెడ్డి భావోద్వేగాలను చక్కగా పలికించారు. రావణ్ నిట్టూరు, సాయి యోగి తదితరులు తమకు పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చరణ్ సాయి మ్యూజిక్ బాగుంది. పాటలు పాత బస్తీ జీవితాలను ఆవిష్కరించేలా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్ రోహిత్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. మాధవి రెడ్డి సోమ నిర్మాణ విలువలు పర్వాలేదు. -
'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర చేశాను : వేద జలంధర్
‘‘అమీర్ లోగ్’ చిత్రకథ హైదరాబాద్‌లోని ఓ బస్తీ నేపథ్యంలో జరుగుతుంది. బస్తీ అన్నది సహజంగా ఉండాలని ఇక్కడి ఓ బస్తీలోని గృహాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం’’ అని వేద జలంధర్ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వేద జలంధర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అమీర్ లోగ్’లో నేను చేసిన గీత పాత్ర పక్కింటి అమ్మాయిలా, మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది’’ అని చెప్పారు. -
‘అమీర్ లోగ్’ని అమితాబ్ చిత్రాలతో పోల్చడం హ్యాపీగా ఉంది: దర్శకుడు
‘‘అమీర్ లోగ్’ చిత్రంలో అన్నిరకాల వాణిజ్య అంశాలుఉన్నాయి. ఈ సినిమా కేవలం యువతకి మాత్రమే కాదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలతో కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ తెలిపారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్ లోగ్’. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ నెల 21న విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో రమణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘మాది నల్గొండ జిల్లాలోని రాఘవపురం. 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కి వచ్చాను. జేఎన్టీయూలో ఆర్టిటెక్ట్ చదివాను. మూడేళ్ల క్రితం షార్ట్ ఫిల్మ్ తీశాను. ‘అమీర్ లోగ్’ సినిమాని బస్తీలోనే షూట్ చేయాల్సి రావడంతో సింక్ సౌండ్‌ని వాడాం. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ చాలా బాగా నటించారు. ‘అమీర్ లోగ్’కి రానాగారి సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రాన్ని చూసిన డైరెక్టర్ వీఎన్ ఆదిత్యగారు అమితాబ్‌గారి ‘ఝుండ్’, రణ్వీర్ సింగ్ ‘గల్లీబాయ్’ చిత్రాలతో పోల్చడం సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు. -
'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)
-
‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)
-
డబ్బులున్న వారా లేదా సంతోషంగా ఉండేవారా? ఎవరు అమీర్?
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమీర్ లోగ్’. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న విడుదల చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ‘అవ్వల్ దావత్...’ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ– ‘‘మాది నల్గొండలోని రాఘవపురం. నేను 1997లో హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ మూవీ తీశాను. డబ్బులున్న వారు అమీర్లోగా? సంతోషంగా ఉండేవారు అమీర్ లోగా? ఎవరు అమీర్? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది’’ అని చెప్పారు. ‘‘అందరూ మా సినిమా చూసి నటీనటులను, సాంకేతిక నిపుణులను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాధవి రెడ్డి. ‘‘హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డిగారు అద్భుతంగా చూపించారు’’ అని స్మరణ్ సాయి చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు? బిర్యానీ ఎలా ఉంటుంది? క్రికెట్ అంటే ఎంత ప్యాషన్? అని ఎవరైనా అడిగితే ‘అమీర్ లోగ్’ సినిమా చూపించండి’’ అని వేద, హరి, మనోజ్, శశిధర్, సాయి యోగి, కీర్తి, రచయిత మనోజ్ కుమార్ పేర్కొన్నారు. -
ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది
‘అమీర్ లోగ్’ సినిమాలో మధ్య తరగతి జీవితాలను చూపించారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది’’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చెప్పారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన సినిమా ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించారు. ఈ చిత్రాన్ని హీరో రానాకి చెందిన స్పిరిట్ మీడియా త్వరలోనే రిలీజ్ చేయనుంది. ఈ మూవీ టీజర్‌ని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ‘‘మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చెప్పారు రమణా రెడ్డి. ‘‘టీజర్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని తెలిపారు మనోజ్. ఈ కార్యక్రమంలో నటీనటులు వేద జలంధర్, విశ్వేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సంగీత దర్శకుడు స్మరణ్ సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడారు.


