ఈ వారం ఓటీటీల్లోకి బెత్లెహెమ్ కుడుంట యూనిట్, రోమాంచకం, సర్దార్ 2, పూజా మేరీ జాన్ తదితర సినిమాలతో పాటు #లవ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ రాబోతున్నాయి. వీటితో పాటు ఏకంగా 23కి పైగా మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే ఓ తెలుగు చిత్రం ఏ మాత్రం హడావుడి లేకుండా మూడు ఓటీటీల్లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
అందరూ కొత్త కుర్రాళ్లతో చేసిన తెలుగు కామెడీ డ్రామా సినిమా 'అమీర్ లోగ్'. రమణా రెడ్డి సోమ దర్శకుడు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. కొత్తోళ్లతో తీసిన చిత్రం కావడం, రవితేజ 'ఇరుముడి' ఎఫెక్ట్ వల్ల ఇదొకటి వచ్చిందనే సంగతి జనాలకు తెలియలేదు. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రం ఆహా, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీల్లోకి వచ్చేసింది.
'అమీర్ లోగ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో శ్రీను (MC హరి), ఫరూక్ (మనోజ్), మల్లేశ్(శశిధర్) అని ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. పనిపాటా లేకుండా తిరుగుతూ, తాగుతూ జులాయిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఓ రోజు అదే బస్తీకి చెందిన నజీర్ (సాయియోగి)తో క్రికెట్ విషయమై గొడవ జరుగుతుంది. వీరి పరిస్థితి గమనించిన అదే బస్తీకి చెందిన గీత (వేద జలంధర్) వీరిని తమ్ముళ్లుగా భావించి బుద్ధి చెప్పి మారమని సూచిస్తుంది. ఆమె సాయంతో శ్రీను ఓ ఆఫీస్‌లో ఆఫీస్ బాయ్‌గా చేరతాడు.
అయితే తన ఆఫీస్ వాళ్లతో క్రికెట్ ఆడిన శ్రీను.. ‘మా బస్తీ వాళ్లు మీకంటే బాగా ఆడతారు’ అని పంతానికి పోయి బెట్ కడతాడు. ఆ మ్యాచ్‌లో బస్తీ టీమ్ గెలిచిందా? లేదా? బస్తీలోని పెద్దాయన చాచా (విశ్వేందర్) వీరికి ఏ విధంగా సాయపడ్డాడు? ఈ కథలోకి ‘బిర్యానీ’ కాన్సెప్ట్ ఎలా ప్రవేశించింది? గీత ప్రియుడు రవి (రావణ్) వల్ల ఈ ముగ్గురి జీవితాలు ఎలా మారాయి? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్)


