జోరుగా... హుషారుగా... | Tollywood Heroes Currently Busy Shooting in Hyderabad | Sakshi
Sakshi News home page

జోరుగా... హుషారుగా...

Sep 30 2026 4:20 AM | Updated on Sep 30 2026 4:20 AM

Tollywood Heroes Currently Busy Shooting in Hyderabad

హార్ట్‌ ఆఫ్‌ ది సిటీలో సందడిగా షూటింగ్స్‌

సినిమా షూటింగ్స్‌ అంటే లోకల్‌లోనే కాదు... కథ డిమాండ్‌ చేస్తే దేశ విదేశాల్లోనూ చిత్రీకరణలు జరుగుతుంటాయి. అయితే టాలీవుడ్‌కి హార్ట్‌ ఆఫ్‌ ది సిటీగా చెప్పుకునే హైదరాబాద్‌లో మాత్రం ఎప్పుడూ సినిమాల షూటింగ్‌ల సందడి నెలకొంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు, రిషబ్‌ శెట్టి, గోపీచంద్, నితిన్, శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోల సినిమాల షూటింగ్స్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భలే జోరుగా జరుగుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం...  

అన్నపూర్ణలో కింగ్‌  
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌ 100’. ఈ సినిమాకి తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నారు కూడా! ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ భాగ్యనగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతోంది. 

ఈ షెడ్యూల్‌లో నాగార్జునతోపాటు టబు కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్‌. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత అక్టోబర్‌ 1 నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్‌ జరగనుంది. అక్కడ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘కింగ్‌ 100’ నాగార్జున కెరీర్‌లో వందో చిత్రం కావడంతో ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్‌ 100’ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా ఈ డిసెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  

 అజీజ్‌ నగర్‌లో...  
‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో వెంకటేశ్‌–డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్‌). ఈ మూవీలో కల్యాణ్‌ రామ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

సురేష్‌ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని అజీజ్‌ నగర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో వెంకటేశ్, కల్యాణ్‌ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల భోగట్టా. అనిల్‌ రావిపూడి. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.  

ఆర్‌ఎఫ్‌సీలో...  
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దాదా’. ఈ మూవీలో మంచు మనోజ్, కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఇది. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట గోపీచంద్‌ మలినేని. ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

కోకాపేటలో...  
ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భాను చందర్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్   యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్‌ లుక్‌లో ప్రభాస్‌ కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ‘ఫౌజి’ సినిమా ఈ డిసెంబరు 3న విడుదల కానుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.  

రాకా యాక్షన్‌...  
‘పుష్ప ది రైజ్, పుష్ప 2: ది రూల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. ఈ మూవీకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ కథానాయికగా నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ భాగ్యనగరం సమీపంలోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌ పాల్గొనడం లేదని తెలిసింది. ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట అట్లీ. 

అక్టోబరులో అల్లు అర్జున్‌ ఈ చిత్రం షూట్‌లో జాయిన్‌ అవుతారని టాక్‌. ఆయనపై కీలకమైన ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించనున్నారట దర్శకుడు. ఇదిలా ఉంటే... ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, విడుదల చేసిన అల్లు అర్జున్‌ ఫస్ట్‌ లుక్‌ ట్రెండ్‌ అయింది. గుండు, వింత శరీరాకృతితో ఓ సరికొత్త అవతారంతో అందర్నీ ఆశ్చర్యపరిచారాయన. ఈ మూవీ 2027లో విడుదల కానుంది.  

శంకరపల్లిలో...  
గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా  ఫైట్‌ మాస్టర్‌ వి. వెంకట్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్‌ హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెడుతున్నారు. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి సినిమాలను నిర్మించిన 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ‘సింగ’ మూవీని నిర్మిస్తున్నారు. 

హైదరాబాద్‌ సమీపంలోని శంకరపల్లిలో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్లతోపాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట వెంకట్‌. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్‌ మాస్టర్‌గా సక్సెస్‌ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌లా కథను తీర్చిదిద్దుతున్నారు. 

గోపీచంద్‌ను సరికొత్త పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు రాజీ పడకుండా నిర్మిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది.  

హనుమాన్‌ 2  
ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘హను–మాన్‌’ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా నటించారు. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజైంది. చిన్న చిత్రంగా ప్రారంభమై, పాన్‌ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హను–మా¯న్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్‌’. ఈ మూవీలో ఆంజనేయ స్వామిగా ‘కాంతారా’ మూవీ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి నటిస్తున్నారు.

‘హను–మాన్‌’లో హనుమంతుగా నటించిన తేజ సజ్జా సీక్వెల్‌లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని ఆర్‌ఎప్‌సీలో శరవేగంగా జరుగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అనే నేపథ్యంలో ‘జై హనుమాన్‌’ని రూపొందిస్తున్నారని సమాచారం.  

మొయినాబాద్‌లో...  
‘నారీ నారీ నడుమ మురారి, బైకర్‌’ వంటి హిట్‌ మూవీస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న హీరో శర్వానంద్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. ఈ మూవీకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం భాగ్యనగరం సమీపంలోని మొయినాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, మానస వారణాసితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సీన్స్‌ తీస్తున్నారట శ్రీను వైట్ల. సంక్రాంతి సీజన్‌లో కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ని అలరించనున్న ఈ సినిమా 2027 జనవరి 14న విడుదల కానుంది. 
 
శంకరపల్లిలో... 
సాయి దుర్గాతేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ మూవీ ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హను–మాన్‌’ వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. సాయి దుర్గాతేజ్‌తో పాటు కీలక తారాగణంపై పలు సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్‌. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.    

పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని మూవీ షూటింగ్స్‌ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జోరుగా హుషారుగా జరుగుతున్నాయి.  

శంషాబాద్‌లో...  
మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ బ్యానర్లపై కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది.

అయితే ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు పాల్గొనడం లేదు. ఎందుకంటే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ని ఆయన ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మహేశ్‌ లేని సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో శ్రీరాముడిగా, రుద్రుడి గా మహేశ్‌బాబు కనిపిస్తారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్‌ కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్‌. 2027 ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

అల్యూమినియం ఫ్యాక్టరీలో... 
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కేఏ 13’(వర్కింగ్‌ టైటిల్‌). దేవిక భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో శరత్‌ కుమార్, సాయి కుమార్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జాయ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్‌ ప్రస్తుతం గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హీరో హీరోయిన్లతోపాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు కిరణ్‌. ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’ సినిమాతో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన,  ‘కేఏ 13’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతోపాటు హీరోగా నటిస్తుండటం విశేషం.  

అల్యూమినియం ఫ్యాక్టరీలో...  
నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్‌ రుక్మిణీ’. మురళీ కాంత్‌ దేవాసోత్‌ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సాయి కుమార్, హర్షవర్ధన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరుగుతోంది. నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట మురళీ కాంత్‌.

 ‘‘కోర్ట్‌–స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ వంటి అద్భుత విజయం తర్వాత నాని సమర్పణలో యునానిమస్‌ ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘అలియాస్‌ రుక్మిణీ’. తొట్ట తొలి చిత్రం ‘దండోరా’తోనే విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్‌ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది ఈ చిత్రం. ఈ సినిమాలో నితిన్‌ చాలా విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం తెలిపింది.  

ఫ్యామిలీ ప్యాక్‌... 
హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్‌ రామ్‌ అబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ హిట్‌ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్‌’. ఈ సినిమాలో సాక్షి మధోల్కర్‌ హీరోయిన్ న్‌గా నటిస్తున్నారు. నరేష్‌ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్, రఘుబాబు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

 మైత్రి మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అనిల్‌ ఎర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్‌ తీస్తున్నారు రామ్‌ అబ్బరాజు. ఈ మూవీ 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement