ఫహాద్ ఫాజిల్ హీరోగా రానున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జూ.ఎన్టీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఫహాద్ చేత ఈ వేదికపై సరదాగా తొడ కొట్టించాడు తారక్. అనంతరం తన వ్యక్తిగత జీవితం, రాజమౌళి కుటుంబంతో తనకున్న ప్రేమానురాగాలతో పాటు త్వరలో రాబోయే ‘డ్రాగన్’ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన సినీ ప్రయాణం ప్రారంభంలో ఎదురైన కష్టాలను ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. అభిమానులు తనకు బలమైతే, రాజమౌళి, కీరవాణి కుటుంబాలు దేవుడు ఇచ్చిన మరో కుటుంబమని చెప్పారు.
కార్తికేయ నా తమ్ముడిలాంటోడు అంటూ ప్రత్యేకంగా ఎన్టీఆర్ ప్రస్తావించారు. తన కెరీర్‌లో కష్టకాలంలో కార్తికేయ తనకు అండగా నిలిచాడని గుర్తుచేసుకున్నారు. చిన్నతనంలో తనకు తమ్ముడు ఉంటే బాగుండేదని అనుకునేవాడినని, కార్తికేయ ఆ లోటును తీర్చాడని భావోద్వేగంగా తెలిపారు. ఇక తనకు జరిగిన చేతి సర్జరీ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పారు. త్వరలోనే ‘డ్రాగన్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటానని వెల్లడించారు. అభిమానులను చూడగానే తనలో మళ్లీ పాత జోష్ వచ్చిందని అన్నారు.
శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్‌దేవ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది.


