మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్‌లకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు పంచుకోరు. అయితే తాజాగా ఫహాద్ చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన సారా పాలేకర్ గురించి మాట్లాడారు. షూటింగ్ సమయంలో ఆమె చూపించిన ఓపిక, నటన కోసం చేసిన సన్నాహకాలను ఫహాద్ ప్రశంసించారు. ఈ క్రమంలో తన భార్య నజ్రియాను ప్రస్తావిస్తూ సరదాగా మాట్లాడారు.
ఇదీ చదవండి: కూతురు పుట్టినరోజు.. ఫొటోలు షేర్ చేసిన అల్లరి నరేశ్..
నేను ఓ చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాను
‘నేను ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అందుకే పిల్లలను చూసుకోవడంలో మీకు ఇంత ఓపిక వచ్చింది. కొందరు నన్ను అడుగుతుంటారు. ఇంత ఓపిక ఎక్కడిది అని. ఇంట్లోనే ఒకరు ఉన్నారు.. ఆమెను చూసుకుంటూ వస్తున్నాను అని చెప్తుంటాను.’ అంటూ ఫహాద్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం సారా పాలేకర్ తనతో ఎంతో ఓపికగా వ్యవహరించారని, ఇప్పటివరకు తనకు ఇంత ఓపిక ఉన్న సహనటి మరొకరు ఎదురుకాలేదని చెప్పారు.
వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా..
ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ‘బెంగళూరు డేస్’ సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. 2014లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా బయటకు చెప్పని ఈ జంట.. అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.
సినిమా విషయానికి వస్తే
ఇక సినిమా విషయానికి వస్తే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్.రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ రోజు ( మంగళవారం)హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: నన్ను గోడకేసి కొట్టేసే వారు.. అవతల పడేవాడ్ని: త్రివిక్రమ్


