2013లో విడుదలై రెండు నేషనల్ అవార్డులు అందుకున్న బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
విడుదలైన సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడు, హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ పురస్కారాలు దక్కాయి. అయితే సినిమా విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగులో అందుబాటులో లేదు. కేవలం హిందీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమాని చూడవచ్చు.
నిజ జీవిత కథతో..
ముంబైకి చెందిన న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త షాహిద్ అజ్మీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన పలువురి తరఫున ఆయన న్యాయపోరాటం చేశారు. అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి న్యాయం అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను సినిమాలో చూపించారు. 2010లో షాహిద్ అజ్మీ హత్యకు గురయ్యారు. ఆయన జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా చేసుకుని హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘షాహిద్’ చిత్రానికి 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రెండు కీలక పురస్కారాలు లభించాయి. హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా, రాజ్‌కుమార్ రావుకు ఉత్తమ నటుడిగా అవార్డులు దక్కాయి.
ఇదీ చదవండి:తారక్ దొరకడం నా అదృష్టం.. రాజీవ్ కనకాల ఎమోషనల్


