షాకింగ్‌.. రిలీజ్‌కి మూడు రోజుల ముందే సినిమా మొత్తం లీక్‌! | Thella Kagitham Movie Leaked In Online | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. రిలీజ్‌కి మూడు రోజుల ముందే సినిమా మొత్తం లీక్‌!

Sep 29 2026 2:09 PM | Updated on Sep 29 2026 2:12 PM

Thella Kagitham Movie Leaked In Online

ఒకవైపు పైరసీ భూతం.. మరోవైపు లీకేజీల బెడద.. చిత్ర పరిశ్రమను తరచూ వెంటాడుతున్న సమస్య ఇది. కోట్లు ఖర్చు పెట్టి, వందలాది మంది నెలల తరబడి కష్టపడి తెరకెక్కించిన సినిమా.. ప్రేక్షకుల ముందుకు రాకముందే బయటకు వచ్చేస్తుండటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా చిన్న చిత్రం ‘తెల్లకాగితం’ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. విడుదలకు మూడు రోజుల ముందే లీక్‌ కావడంతో చిత్రబృందం ఆందోళనలో పడింది.

కోర్ట్‌ ఫేమ్‌ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ‘తెల్లకాగితం’పై మొదటి నుంచీ మంచి బజ్‌ ఉంది. ఈ సినిమాను  ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకంగా చూపించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన వారంతా పాజిటివ్‌గా స్పందించడంతో పాటు.. బిజినెస్‌ పరంగానూ ఈ చిత్రానికి మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీంతో అక్టోబర్‌ 2న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై చిత్రబృందం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే సోమవారం అర్థరాత్రి అనూహ్యంగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మొదట ఒకట్రెండు సీన్లే బయటకు వచ్చాయని భావించినా.. లీకైనవి సాధారణ సన్నివేశాలు కాకపోవడం చిత్రబృందాన్ని మరింత కలవరపెట్టింది. సినిమాలో కీలకంగా నిలిచే ఎపిసోడ్లకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో.. అసలు సినిమా మొత్తం లీక్‌ అయిందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

లీకైన కంటెంట్‌కు సంబంధించిన లింకులను గుర్తించి, వాటిని తొలగించేందుకు చిత్రబృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అవుతున్న వీడియోలు, లింకులపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో లీకైన ‘తెల్లకాగితం’ కంటెంట్‌ను ఎవరూ షేర్‌ చేయవద్దని, సినిమా అనుభూతిని థియేటర్లలోనే ఆస్వాదించాలని చిత్రబృందం ప్రేక్షకులను కోరింది. కష్టపడి తెరకెక్కించిన సినిమాను ఇలా విడుదలకు ముందే లీక్‌ చేయడం వల్ల నిర్మాతలు, చిత్రబృందం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇప్పటికే పలు పెద్ద సినిమాలు సైతం పైరసీ, లీకేజీల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా చిన్న చిత్రం ‘తెల్లకాగితం’కు ఎదురైన ఈ పరిణామం.. రిలీజ్‌కు ముందు కంటెంట్‌ భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement