దినేష్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోల దర్శకత్వంలో రూ పొందిన చిత్రం ‘తత్వం’. త్రయతి ఇషాని క్రియేషన్స్ , ఎస్.కె ప్రోడక్షన్స్ పై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా దష్విక మాట్లాడుతూ–‘‘నా స్వస్థలం వైజాగ్. చిన్నప్పటి నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం.
నేను మూడో తరగతి చదువుతున్నప్పుడు ‘పెద్దయ్యాక ఏమవుతావు? అని టీచర్ అడిగితే హీరోయిన్ అవుతానని చెప్పాను. చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీకి వెళ్లమని నా తల్లిదండ్రులు నన్ను సపోర్ట్ చేశారు. బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. విజయ్ దేవరకొండతో కలిసి ఓ వాణిజ్య ప్రకటన చేశాను. హీరోయిన్ గా ‘తత్వం’ నా తొలి సినిమా.
కిల్లర్‌ను అన్వేషించే హీరోకు సపోర్ట్ చేసే పాత్ర నాది. నా క్యారెక్టర్‌లో గ్రే షేడ్స్ ఉన్నాయి. మర్డర్, మిస్టరీ, సస్పెన్స్ ... ఈ మూడు అంశాలు మిళతమై ఉన్న సినిమా ఇది. సాధారణంగా మలయాళంలో ‘తత్వం’ సినిమా తరహా స్టోరీలు వస్తుంటాయి. ఇప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా రావడం నాకు సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తొలుత కాస్త భయపడ్డాను. కానీ. బయట అనుకుంటున్నంత చెడ్డగా ఏం లేదు. తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు.


