రవిశంకర్, సాయి రాజేష్, శివ నిర్వాణ, వినాయక్, విక్రమ్
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనకాపల్లి’. త్రినాథరావు నక్కిన ఈ సినిమాలో నటించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించి, నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాండ్రేగుల నాయుడు మరో నిర్మాతగా, కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ–‘‘అనకాపల్లి’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు.
‘‘విక్రమ్ అతి తక్కువ సమయంలోనే పెద్ద హీరో అవుతాడు’’ అని చెప్పారు దర్శక–నిర్మాత, రచయిత సాయి రాజేష్. ‘‘అనకాపల్లి’ ప్రేమ, స్నేహం, కుటుంబం నేపథ్యంలో రూ పొందింది’’ అన్నారు విక్రమ్ సహిదేవ్. ‘‘ఈ చిత్రంలోని మాటలు, ఫైట్స్, పాటలు.. ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి’’ అని తెలిపారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమాను రిలీజ్ చేస్తున్న మైత్రి సంస్థకు ధన్యవాదాలు’’ అని చెప్పారు నిర్మాత కాండ్రేగుల నాయుడు.
‘‘ఈ సినిమాకు మంచి ప్రేక్షక ఆదరణ లభించాలి’’ అని పేర్కొన్నారు నిర్మాత వై.రవిశంకర్, దర్శకుడు శివ నిర్వాణ. నిర్మాత లగడపాటి శ్రీధర్, దర్శకుడు కిరణ్ షా హుస్సేన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సినిమాటోగ్రాఫర్–డైరెక్టర్ రసూల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జండ్, కెమెరామెన్ మాయా వి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు.


