తాత–నాన్నలా జేసన్‌ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి | Megastar Chiranjeevi as the chief guest at the grand pre-release event for SIGMA | Sakshi
Sakshi News home page

తాత–నాన్నలా జేసన్‌ గొప్ప స్థాయికి వెళ్లాలి: చిరంజీవి

Sep 26 2026 5:22 AM | Updated on Sep 26 2026 6:41 AM

Megastar Chiranjeevi as the chief guest at the grand pre-release event for SIGMA

‘‘ఈ మధ్య కంటెంట్‌ బాగున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అది చిన్న సినిమానా? పెద్ద చిత్రమా? అని ఆలోచించడం లేదు. అదే కోవలో ‘సిగ్మా’ హిట్టవ్వాలని కోరు కుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు. సందీప్‌ కిషన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్‌ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 2న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ కోస్తాంధ్ర, తెలంగాణలో, సీడెడ్‌లో ఎన్‌వీఆర్‌ సినిమా రిలీజ్‌ చేస్తున్నాయి. 

శుక్రవారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘జేసన్‌ సంజయ్‌ని చూస్తుంటే తన గ్రాండ్‌ఫాదర్‌ ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌గారు గుర్తొస్తారు. నాతో ‘చట్టానికి కళ్ళులేవు, దేవాంతకుడు’ వంటి అద్భుతమైన సినిమాలు తీశారాయన. ఆయన మనవడు సంజయ్‌ ఓ సినిమాకి దర్శకత్వం వహించాడంటే సంతోషంగా ఉంది. విజయ్‌ నటించిన ఓ మూవీ ఓపెనింగ్‌కి నేను, రజనీకాంత్‌ వెళ్లి క్లాప్‌ కొట్టాం. ఆ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు ‘సిగ్మా’ ఈవెంట్‌కి అతిథిగా నన్ను పిలవడానికి వచ్చాడని హ్యాపీగా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను.

‘నువ్వు మీ నాన్నలా యాక్టర్‌ అవకుండా ఎందుకు డైరెక్షన్‌ ఎంచుకున్నావు?’ అని అడిగితే.. ‘నాకు ముందు నుంచి రైటింగ్, డైరెక్షన్‌ అంటే ఇష్టం’ అన్నాడు జేసన్‌. వాళ్ల తాత చంద్రశేఖర్‌ (డైరెక్టర్‌), నానమ్మ శోభ (రచయిత) జీన్స్‌ని పుణికి పుచ్చుకున్నాడు కాబట్టే ఈ రోజు డైరెక్షన్‌ చేయడానికి ముందుకొచ్చాడు. తాత చంద్రశేఖర్, నాన్న విజయ్‌ ఎంత గొప్ప స్థాయికి వెళ్లారో జేసన్‌ కూడా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. సందీప్‌ని చూస్తుంటే నా యంగ్‌ డేస్‌ గుర్తొచ్చాయి. ఇండస్ట్రీకి కొత్త రక్తం వస్తే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది.

 పాత తరం కూడా ఉండాలి.. లేదంటే నన్ను పొమ్మంటారు. అలాగే కొత్త తరం రావాలి.. కొత్త పుంతలు తొక్కాలి’ అని పేర్కొన్నారు.  సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘సిగ్మా’ కథను తొలుత దుల్కర్‌ సల్మాన్‌గారికి చెప్పాడు జేసన్‌. ఆయన బిజీగా ఉండటంతో చేయలేకపోయారు. ఆ తర్వాత నాకు ఈ కథ చెప్పాడు జేసన్‌. చెప్పింది చెప్పినట్టుగా తీశాడు’’ అని చెప్పారు. జేసన్‌ సంజయ్‌ మాట్లాడుతూ–‘‘సిగ్మా’ యాక్షన్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌. అన్ని వయసుల వారికి మా మూవీ నచ్చుతుంది. నా కథను నమ్మి సినిమా చేసిన సందీప్‌ బ్రోకి థ్యాంక్స్‌. ఫరియా కెరీర్‌లో ఇది మరచిపోలేని తమిళ చిత్రం అవుతుంది’’ అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ హెడ్‌ తమిళ్‌ కుమరన్, కెమెరామేన్‌ ఛోటా కె. నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement