రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించాడు. ప్రభాస్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కొద్దిసేపు కనిపించే ఆయన పాత్ర.. ఆ తర్వాత కథలో ఎక్కడా పెద్దగా కనిపించదు. అయితే ఇప్పుడు ఈ పాత్రను ‘కల్కి 2’లో మళ్లీ తీసుకురాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్-2లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ పాత్రల చుట్టూనే కథ ప్రధానంగా సాగనున్నట్లు తెలుస్తోంది. కల్కిలో అత్యంత కీలకమైన సుమతి పాత్ర కోసం దీపికా పదుకోన్ స్థానంలో వేరే హీరోయిన్‌ను కూడా తీసుకోవడం లేదు. మిగితా పాత్రలతోనే కథను ముందుకు తీసుకెళ్తామని ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్క్రీన్‌ప్లేలో చేసిన మార్పుల కారణంగా దుల్కర్ పాత్రను కీలకమైన సమయంలో మళ్లీ కథలోకి తీసుకురానున్నారని సమాచారం. అయితే ఇది వైజయంతీ మూవీస్‌కు దుల్కర్‌పై ఉన్న సెంటిమెంట్‌లో భాగమా? లేక ఈ సినిమా కథకు అవసరమైన మార్పుల్లో భాగమా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి దుల్కర్ ‘కల్కి 2’లో నటిస్తున్నారనే వార్తకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రానున్న రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.


