నేటి ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఏఐతో రూపొందిస్తున్న వీడియోలు, పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. సినిమా రంగంలోనూ ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏఐ గంటల్లో, నిమిషాల్లో పూర్తి చేస్తోంది
జార్జియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడిన రాజమౌళి.. సినిమా రంగంలో ఏఐ వినియోగం, దాని ప్రభావం గురించి వివరించారు. ‘ఏఐ భవిష్యత్తు గమనం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. సాంకేతికత, దాని వినియోగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి పరిశోధన, అభివృద్ధి వంటి ప్రాథమిక పనులకు ఏఐ అద్భుతమైన సాధనం. గతంలో వారాలు, నెలలు పట్టే పనులను ఇప్పుడు ఏఐ గంటల్లో, నిమిషాల్లో పూర్తి చేస్తోంది’ అని అన్నారు. ఇకపై సినిమా చాలా తొందరగా పూర్తిచేసేందుకు అవకాశముందన్నారు.
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తాము ప్రాథమిక సమాచారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఏఐని సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నామని రాజమౌళి తెలిపారు. డిజిటల్ కంటెంట్, సినిమా నిర్మాణంలో ఏఐపై ఆధారపడటం లేదని స్పష్టం చేశారు.
120 దేశాల్లో విడుదల
ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రంలో కీలక సన్నివేశాలను మోషన్ క్యాప్చర్ సాంకేతికతతో ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సింహభాగం పూర్తయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాను 50 భాషల్లోకి అనువదించి, 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి: పులిలా వచ్చిన ఎన్టీఆర్.. రాజమౌళి ఏర్పాట్లు అదుర్స్


