బుల్లితెరపై తనదైన కామెడీ, అల్లరితో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక సింగ్.. తన జీవితంలో ఎన్నో సవాళ్లను దాటి ఈ స్థాయికి చేరుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ ఐదో సీజన్‌లో అడుగుపెట్టి మరింత దగ్గరైంది. అయితే తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ప్రియాంక జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరి పోరాటం ఉన్నాయని కొంతమందికే తెలుసు.
ఇదే విషయాన్ని.. తాను కోరుకున్న జీవితాన్ని సొంతం చేసుకునేందుకు పదేళ్ల క్రితం వేసిన అడుగు గురించి తాజాగా సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ఇప్పుడీ పోస్ట్ అభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది. అసలు ఆమె ఎవరు.. అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ విషయాలు ఒకసారి చూద్దాం.
(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)
‘అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి’
‘పదేళ్లు గడిచాయంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అప్పట్లో నేను ఎదుర్కొన్న బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం అన్నీ ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ‘ఏం చేయాలి? అసలు నేను ఎవరు?’ అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నా. అయినప్పటికీ నేను కోరుకున్న వ్యక్తిగా జీవించాలనే పట్టుదలతో ముందుకు సాగాను’ అని ప్రియాంక పేర్కొంది.
‘నేను సాధించాను’
గడిచిన పదేళ్లలో వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌లోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను కృంగిపోలేదని చెప్పింది. ‘ఈ రోజు అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ‘నేను సాధించాను’ అని గర్వంగా చెప్పుకోగలను. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను. ఈ అందమైన జీవితాన్ని, ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.
తన పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రయాణాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు తానే గర్వంగా అనిపిస్తోందని ప్రియాంక తెలిపింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రియాంక ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.
(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమా?)


