బాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘కభీ ఖుషీ కభీ గమ్’ (K3G) సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మూవీ విడుదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎయిర్‌బీఎన్‌బీ( Airbnb )అభిమానుల కోసం ఓ ప్రత్యేక అనుభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలోని రాయ్‌చంద్ కుటుంబ భవనాన్ని ముంబైలో పునఃసృష్టించి, అభిమానులకు ఆ ఇంటిని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశాన్ని కల్పిస్తోంది.
‘ఎట్ హోమ్ విత్ ది రాయ్‌చంద్స్’
‘ఎట్ హోమ్ విత్ ది రాయ్‌చంద్స్’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రెండు గంటల పాటు సాగే ఈ అనుభవం డిసెంబర్ 1 నుంచి 6 వరకు కొనసాగుతుంది. మొత్తం 180 మంది అతిథులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. నవంబర్ 23 నుంచి ఎయిర్‌బీఎన్‌బీలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
రాయ్‌చంద్ హౌస్‌లో సినిమాలో కనిపించిన గ్రాండ్ మెట్లదారి, ఫ్యామిలీ స్టడీతో పాటు పూ పాత్రకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన వార్డ్‌రోబ్‌ను కూడా అభిమానులు చూడొచ్చు. K3Gలోని ముఖ్యమైన సన్నివేశాలు, పాత్రలు, డైలాగ్స్‌ను గుర్తు చేసేలా ఈ మొత్తం అనుభవాన్ని రూపొందించారు.
పూ, రోహన్ పాత్రల జ్ఞాపకాలు
ఈ అనుభవంలో రాయ్‌చంద్ కుటుంబం తరహాలో ప్రత్యేక స్వాగతం పలకడంతో పాటు రోహన్ పాత్రను గుర్తు చేసే టంగ్ ట్విస్టర్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, డైలాగ్స్‌ను గుర్తు చేసే ఇమర్సివ్ ఆడియో టూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
(చదవండి: కిషన్ రెడ్డి పాదయాత్రకు హీరో నాగార్జున మద్దతు)
అలాగే పూ ఫ్యాషన్ స్టైల్, ఆమె వార్డ్‌రోబ్‌కు సంబంధించిన ప్రత్యేక అనుభవం కూడా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ప్రేమ, కుటుంబ బంధాలను గుర్తు చేసుకుంటూ తమకు ఇష్టమైన వ్యక్తికి ఒక నోట్ రాసే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ అనుభవాన్ని గుర్తు చేసుకునేందుకు అతిథులకు ప్రత్యేక జ్ఞాపికను కూడా అందిస్తారు.
మళ్లీ పూ, రోహన్‌గా కరీనా, హృతిక్
ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రమోషన్‌లో భాగంగా కరీనా కపూర్, హృతిక్ రోషన్ మరోసారి పూ, రోహన్ పాత్రల రూపంలో కనిపించారు. 2001లో విడుదలైన ‘కభీ ఖుషీ కభీ గమ్’లో వీరిద్దరూ పోషించిన పాత్రలు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. వీరిద్దరూ చివరిసారిగా 2003లో వచ్చిన ‘మై ప్రెమ్ కీ దీవానీ హూన్’ చిత్రంలో కలిసి నటించారు.
దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగం కానున్నారు. ఒక బుకింగ్ ద్వారా ఒక అతిథితో పాటు మరో వ్యక్తిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ముంబైకి వెళ్లి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులను మాత్రం అతిథులే భరించాల్సి ఉంటుంది.K3G అభిమానులకు తమకు ఎంతో ఇష్టమైన రాయ్‌చంద్ కుటుంబ ప్రపంచాన్ని దగ్గరగా అనుభవించే ఈ అవకాశం ఎంతవరకు క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.


