కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 25, 26, 27 తేదీల్లో 'నషా ముక్త్ భారత్ యాత్ర' పాదయాత్ర జరగనుంది. యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై పోరాటానికి సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కోసం చేపడుతున్న ఈ ర్యాలీకి ఇప్పటికే చిరంజీవి తన సపోర్ట్ అందించగా ఇప్పుడు అక్కినేని నాగార్జున సంపూర్ణ మద్దతు తెలిపారు.
(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'కల్ట్')
హైదరాబాద్‌లో జరిగే వాక్‌లో పాల్గొనాలని నాగార్జునను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డితో కలిసి నషా ముక్త్ భారత్ యాత్ర టీ-షర్టులని నాగార్జున ఆవిష్కరించారు. డ్రగ్స్ మత్తులో యువత జీవితాలు నాశనం కావడం ఆందోళనకరమని చెప్పిన నాగ్.. డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తన మద్దతు ఉంటుందని చెప్పారు.
ప్రధాని మోదీ ఇచ్చిన 'నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్' పిలుపుతో ఈ యాత్ర జరగనుండగా.. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా యువత, తల్లిదండ్రులు, ప్రజలంతా యాత్రలో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)


