తెలుగు, తమిళ సినిమాల్లో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ తెలిసిన అర్జున్ సర్జా.. ఈ ఏడాది 'బ్లాస్ట్' మూవీతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. మూడు వారాల క్రితం చిన్న కూతురిని విదేశీయుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ శుభకార్యంలో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య భర్త కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఈమె విడాకులు ఇచ్చేసిందని మాట్లాడుకున్నారు. దీంతో ఐశ్వర్య మద్యానికి బానిస అయిపోయిందని కొందరు ఇష్టమొచ్చినట్లు వాగారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అర్జున్.. ఓ నోట్ రిలీజ్ చేశాడు.
(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 'కల్ట్')
ముందుగా నా చిన్న కూతురు అంజనా పెళ్లికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అయితే ఈ వివాహం జరిగిన టైంలో పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ నేను ఆమె వ్యక్తిగత విషయాలపై స్పందించకుండా, గోప్యతని గౌరవిస్తూ మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి మహిళ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకునే హక్కు కలిగి ఉంది. ఐశ్వర్య కూడా తనకు అనిపించినప్పుడు తానే విషయాలని వెల్లడిస్తుంది.

కానీ తండ్రిగా నా కూతురు వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు, అవమానకరమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేను. ప్రజాజీవితంలో ఉన్నోళ్లపై విమర్శలు, పుకార్లు సహజమే గానీ ఆధారాలు లేకుండా ఒక మహిళపై ఆరోపణలు చేయడం, ఆమెని మద్యపానానికి బానిసగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. మౌనం గౌరవప్రదమైన స్పందన. అయితే దానిని అంగీకారంగా భావించకూడదు. తప్పుడు ప్రచారం పదేపదే చేయడాన్ని సహించలేం.
జర్నలిజం, వార్తా రిపోర్టింగ్ వృత్తులపై నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలను పట్టించుకోకుండా సంచలనాల కోసం వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయం కేవలం నా కూతురికి సంబంధించినది మాత్రమే కాదు. సమాజంలో ప్రతి మహిళ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కుటుంబం సపోర్ట్ లేని మహిళలకు ఇలాంటి ఆరోపణలు మరింత ఇబ్బందికరంగా మారుతాయి.ఇకపై ఇలాంటి నిరాధార, పరువునష్టం కలిగించే ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గౌరవం, ఆత్మాభిమానం విషయంలో రాజీ ఉండదు' అని అర్జున్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య.. తమిళ కమెడియన్ తంబిరామయ్య కొడుకు, దర్శకుడు ఉమాపతిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో 2023 అక్టోబరులో వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. 2024 జూన్ 10న పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నిరోజుల క్రితం అర్జున్ చిన్న కూతురు పెళ్లి ఇటలీలో జరగ్గా.. ఇందులో ఉమాపతి కనిపించలేదు. దీంతో విడాకులు రూమర్స్ వచ్చాయి. అయితే అర్జున్ తాజాగా రిలీజ్ చేసిన నోట్‌లో విడాకులు తీసుకున్నారా లేదంటే కలిసున్నారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఐశ్వర్య.. అర్జున్ దర్శకత్వం వహించిన 'సీతా పయనం' సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిలీజైంది. కానీ జనాలు ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర' విలన్‌కి హత్య బెదిరింపులు)


