మూవీ చూశాక తిడుతున్నారు.. థమన్‌‍కి ఇదే నా రిక్వెస్ట్‌ : నాగార్జున | Nagarjuna Advice Filmmakers to Complete Movies Two Months Before Release | Sakshi
Sakshi News home page

Nagarjuna: ‘విమర్శలకు చెక్‌ పెట్టాలంటే ఇదే మార్గం’

Nov 15 2026 2:53 PM | Updated on Nov 15 2026 3:04 PM

Nagarjuna Advice Filmmakers to Complete Movies Two Months Before Release

అక్కినేని నాగార్జున సమర్పణలో వెంకీ కుడుముల నిర్మించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనీష్, అనశ్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా నిర్మాణం, విడుదలకు సంబంధించిన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదే నా విజ్ఞప్తి
సినిమాను అనుకున్న విడుదల తేదీ కంటే రెండు నెలల ముందే పూర్తి చేసుకోవాలని నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు నాగార్జున సూచించారు. ‘నిర్మాతలు, దర్శకులు, థమన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులకు ఇదే నా విజ్ఞప్తి. సినిమా పనులను రెండు నెలల ముందే పూర్తి చేసుకుంటే.. 75 శాతంతో సిద్ధమైన సినిమాను 100 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మిగిలిన సమయంలో సినిమాను మరింత మెరుగుపరచుకోవచ్చు. విడుదలకు తగినంత సమయం ఉంటే అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది.

బాగోలేదని తిడుతున్నారు
చాలామంది సినిమా చూసిన తర్వాత వీఎఫ్‌ఎక్స్ బాగోలేదని తిడుతున్నారు. ఏఐతో సృష్టించారని కూడా సులభంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సినిమా విడుదలకు ముందే తగినంత సమయం ఉంటే వీఎఫ్‌ఎక్స్‌పై మరింత శ్రద్ధ పెట్టవచ్చు. ఇలాంటి విమర్శలకు అవకాశం లేకుండా నాణ్యతను పెంచుకోవచ్చు’ అని నాగార్జున పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: సినీ నటుడు కృష్ణకు వైఎస్ జగన్ నివాళి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement