‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Irumudi Movie Review and Rating: Ravi Teja Shines in Emotional Family Drama | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Aug 21 2026 12:24 PM | Updated on Aug 21 2026 1:26 PM

Irumudi Movie Review And Rating In Telugu

టైటిల్‌: ఇరుముడి
నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్‌ ఇందిర తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ యేర్నేని, వై రవిశంకర్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
విడుదల తేది: ఆగస్ట్‌ 21,2026

వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ.. రవితేజ ఖాతాలో ఓ మంచి హిట్‌ పడి చాలా కాలమైంది. దీంతో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లోనూ గతంలో ఉన్నంత ఆసక్తి, అంచనాలు కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత రవితేజ నటించిన ఓ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయిందంటే అది ‘ఇరుముడి’ అనే చెప్పాలి. సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరి ఇంతటి హైప్‌ మధ్య నేడు(ఆగస్ట్‌ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’ ఎలా ఉంది?  ఈ చిత్రంలో రవితేజ హిట్‌ట్రాక్‌ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, సీలేరు ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ గ్రామానికి చెందిన త్రినాథ(రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ అలియాస్‌ మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్పమాల ధరించిన 41 రోజులు తప్ప.. మిగతా రోజులన్నీ తాగుతూనే ఉంటాడు. 

ఊర్లో ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిన.. త్రినాథ్‌ ఊరుకోడు. దానివల్ల త్రినాథ్‌కు చాలా మంది శత్రువులు ఏర్పడతారు. మరోవైపు ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే ఉండడంతో హైస్కూల్ కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. ఆ స్కూల్‌ టీచర్‌(స్వసికా) స్టూడెంట్స్‌ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటుంది. అదే సమయంలో ఆ స్కూల్‌లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్ని నిజాలు మణికంఠకు తెలుస్తాయి.  ఆవేంటి? ప్రతి విషయాన్ని తండ్రితో చెప్పే మణికంఠ.. ఆ విషయాలను కూడా తండ్రికి చెప్పిందా?  ఆ విషయం తెలిసిన తర్వాత త్రినాథ్‌ ఏం చేశాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో త్రినాథ్ అనుబంధం ఎలా ఉంది?  త్రినాథ్‌ మాలలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
మాస్‌ మహారాజా రవితేజను అయ్యప్పమాల నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ‘ఇరుముడి’పై ఆసక్తి మొదలైంది. రవితేజ మాస్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన భక్తి నేపథ్యాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఎలా డీల్‌ చేశారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో దర్శకుడు తనదైన మార్క్‌ చూపించారు. అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని తీసుకుని ఓ కుటుంబ కథను రాసుకున్న ఆయన.. దానికి క్రైమ్‌ ఎలిమెంట్‌ను జోడించి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచారు.

ఎమోషన్‌, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కథకు తగ్గట్టుగా మిక్స్‌ చేయడం సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్లను దర్శకుడు బలంగా రాసుకున్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేయడంతో పాటు.. పిల్లలను ఎలా పెంచాలి, వారి విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనే విషయాలను ఇందులో చర్చించారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.

భక్తి నేపథ్యం ఉన్నప్పటికీ ‘ఇరుముడి’ పూర్తిగా భక్తి చిత్రంగా మారిపోలేదు. ఇది పక్కా కమర్షియల్‌ సినిమా.  రొటీన్‌ స్టోరీనే అయినా.. స్క్రీన్‌ప్లేను నడిపించిన విధానం ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలను కథలో ఇరికించిన విధానం సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది.

స్కూల్‌లో విద్యార్థులను ఇబ్బంది పెట్టే టీచర్‌ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత రవితేజ ఎంట్రీ, భార్య-కూతురితో ఆయనకున్న అనుబంధం, కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలు ఫస్టాఫ్‌ సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌ పూర్తిగా పాజిటివ్‌గా ఉందని చెప్పలేం. ముఖ్యంగా స్కూల్‌ ఎపిసోడ్స్‌లో కొన్ని సన్నివేశాలు ఒకే తరహాలో రిపీట్‌ కావడం, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ లోపాలను అయ్యప్ప పాటలు, భక్తి సన్నివేశాలు కొంతవరకు కవర్‌ చేశాయి. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది.  పాత్రల మధ్య సంఘర్షణ, ఎమోషనల్‌ సీన్లు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కథను ముందుకు తీసుకెళ్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రధాన ఎమోషన్‌ను క్లైమాక్స్‌లో బలంగా క్యారీ చేయడంలో దర్శకుడు మంచి ప్రభావాన్ని చూపించారు.

అయితే ‘ఇరుముడి’లో లోపాలు కూడా లేకపోలేదు. దర్శకుడు కథను నమ్మి కొన్ని సందర్భాల్లో సినిమాటిక్‌ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపించడంతో పాటు.. మరికొన్ని చోట్ల కథనం మరింత సహజంగా ఉండాల్సిందనే భావన కలుగుతుంది. మొత్తంగా ‘ఇరుముడి’ భక్తి నేపథ్యాన్ని కమర్షియల్‌ కథతో ముడిపెట్టిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. 

ఎవరెలా చేశారంటే.. 
రవితేజ తన రెగ్యులర్‌ మాస్‌ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాడు.  సాధారణ మధ్యతరగతి తండ్రి త్రినాథ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఇలా అన్ని రకాల సన్నివేశాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తండ్రిగా భావోద్వేగాలను పలికించిన సన్నివేశాల్లో రవితేజ నటన మెప్పిస్తుంది.

ప్రియా భవానీ శంకర్‌ మిడిల్‌ క్లాస్‌ గృహిణి పాత్రలో సహజంగా నటించింది. కుటుంబ బాధ్యతలు, భావోద్వేగాలను తన నటనతో చక్కగా చూపించింది. ఇక ఈ సినిమాకు బేబీ నక్షత్ర ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆమె పాత్ర చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కీలక సన్నివేశాల్లో నక్షత్ర అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జబర్దస్త్‌ కొమరం నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తన మార్క్‌ చూపించాడు. సీరియస్‌ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూ పాత్రకు న్యాయం చేశాడు. ఇక గురుస్వామి పాత్రలో సాయి కుమార్‌ అనుభవం కనిపిస్తుంది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ కూడా అదిరిపోతుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్‌ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఇరుముడి’ పాట, సెకండాఫ్‌లో వచ్చే ‘మల్లె పూల’పాటు అయ్యప్ప భక్తులకు పూనకాలు తెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా  ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌
 


 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement