రవితేజ, ప్రియా భవానీశంకర్ హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బేబీ నక్షత్ర మాట్లాడుతూ– ‘‘మా స్వస్థలం కేరళ. ప్రస్తుతం ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటివరకు నేను ఆరు సినిమాల్లో నటించాను.
ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను. ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీశంకర్‌గార్ల కుమార్తె మణికంఠ పాత్రలో నటించాను. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నన్ను చూసి, శివ నిర్వాణగారు ఈ సినిమాకు ఎంపిక చేశారు. నాకు తెలుగు రాకపోయినా సెట్స్‌లో ఆయన చాలా హెల్ప్ చేశారు.
శివగారి సపోర్ట్‌తోనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాను. నా చిన్న వయసులోనే శివరాజ్‌కుమార్, పృథ్వీరాజ్, రవితేజగార్ల వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాను. ఇందుకు మా అమ్మగారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. అలాగే మా టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు’’ అని చెప్పింది.


