హాలీవుడ్‌ సిరీస్‌.. క్యారీ లుక్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌.. డైరెక్టర్‌ స్పందన ఇదే! | Carrie New Tv Series Fans Criticise Casting Changes | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ సిరీస్‌.. క్యారీ లుక్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌.. డైరెక్టర్‌ స్పందన ఇదే!

Oct 5 2026 1:42 PM | Updated on Oct 5 2026 1:42 PM

Carrie New Tv Series  Fans Criticise Casting Changes

హారర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘క్యారీ’ పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ రచయిత స్టీఫెన్‌ కింగ్‌ 1974లో రాసిన ఈ నవల ఆధారంగా ఇప్పటికే పలుమార్లు సినిమాలు, టీవీ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కథను ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే ప్రముఖ హారర్‌ దర్శకుడు మైక్‌ ఫ్లానగన్‌ రూపొందించిన ఈ సిరీస్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలకు సిద్ధమవుతోంది.  ట్రైలర్‌, పోస్టర్లు బయటకు వచ్చినప్పటి నుంచే కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్యారీ పాత్రను పుస్తకంలో ఉన్నట్టుగా కాకుండా భిన్నంగా చూపించడంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది.

స్టీఫెన్‌ కింగ్‌ నవలలో క్యారీ వైట్‌ 16 ఏళ్ల అమ్మాయి. చిన్నప్పటి నుంచి పాఠశాలలో తోటి విద్యార్థుల వేధింపులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఇంట్లోనూ ఆమెకు ప్రశాంతత ఉండదు. కఠినమైన మత విశ్వాసాలు కలిగిన తల్లి ఆమెను ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. క్యారీకి తన ఆలోచనలతో వస్తువులను కదిలించే టెలికైనెటిక్‌ శక్తి ఉంటుంది. భయం, కోపం, ఒత్తిడి పెరిగినప్పుడు ఈ శక్తి మరింత తీవ్రంగా బయటపడుతుంది. అయితే పుస్తకంలో క్యారీని చాలా సాధారణంగా, ఆకర్షణీయంగా లేని అమ్మాయిగా రచయిత చూపించారు. కానీ ఇప్పటివరకు వచ్చిన తెర రూపాల్లో మాత్రం క్యారీ పాత్రను అందంగా కనిపించే నటీమణులే పోషించారు. ఇదే విషయంపై అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

అంతేకాదు.. పుస్తకంలోని క్యారీకి, తెరపై కనిపించే క్యారీకి మరో ముఖ్యమైన తేడా ఉంది. నవలలో ఆమె అమాయకంగా మాత్రమే కాకుండా చాలా కోపంతో, తనపై జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. తనలోని శక్తితో ఏం చేయగలనో ఆమెకు తెలుసు. కానీ సినిమాలు, టీవీ వెర్షన్లలో క్యారీని ఎక్కువగా బాధపడే, అమాయకమైన అమ్మాయిగానే చూపించారు. కొత్త సిరీస్‌లోనూ కొన్ని కీలక మార్పులు చేశారు. ఇందులో క్యారీ చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చదువుకుని, తండ్రి మరణించిన తర్వాత తొలిసారి పాఠశాలలో అడుగుపెడుతుంది. దీనివల్ల ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూసే సమయంలోనే తోటి విద్యార్థుల వేధింపులు ఎదురవుతాయి. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సోషల్‌ మీడియా వేధింపులను కూడా కథలో చేర్చారు.

అయితే పుస్తకం ఆధారంగా సినిమా లేదా సిరీస్‌ తీసేటప్పుడు కొన్ని మార్పులు చేయడం సహజమేనని సినీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రేక్షకులకు కథను దగ్గర చేయడంతో పాటు, మార్కెట్‌ అవసరాలు కూడా పాత్రల ఎంపికపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. అదే సమయంలో పుస్తకాన్ని అచ్చుగుద్దినట్టుగా తెరపై చూపించాల్సిన అవసరం లేదని దర్శకుడు లియామ్‌ గావిన్‌ అభిప్రాయపడ్డారు. మొత్తానికి కొత్త ‘క్యారీ’ పాత కథను కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే పుస్తకంలోని క్యారీ పాత్రకు భిన్నంగా కనిపిస్తున్న కొత్త రూపం అభిమానులకు ఎంతవరకు నచ్చుతుందనేది సిరీస్‌ విడుదలైన తర్వాతే తేలనుంది.

ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో ఊహించని రెస్పాన్స్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement