పగటి కలలు కనొద్దు.. రాందేవ్‌కు కంగనా ఘాటు కౌంటర్‌ | Donot Daydream About Me: Kangana Ranaut Sharp Reply to Baba Ramdev | Sakshi
Sakshi News home page

పగటి కలలు కనొద్దు.. రాందేవ్‌కు కంగనా ఘాటు కౌంటర్‌

Aug 20 2026 7:30 AM | Updated on Aug 20 2026 7:41 AM

Donot Daydream About Me: Kangana Ranaut Sharp Reply to Baba Ramdev

న్యూఢిల్లీ: జెన్‌జీ వ్యాఖ్యల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని.. ఆ అవసరం కూడా లేదని సోషల్‌ మీడియా వేదికగా రాందేవ్‌కు కాస్త ఘాటైన చురకలే అంటించారు.

‘‘బాబాజీ.. నా యవ్వనం గురించి, నా బెడ్‌రూమ్‌ గురించి పగటి కలలు కనొద్దు’’ అంటూ కంగనా(40) ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొన్నారు. వదంతులు, ఊహాగానాల ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని అన్నారు. ‘‘నాకు ఎప్పుడూ తప్పుడు ప్రచారాల విషయంలో సుప్రీంకోర్టు నుంచి చివాట్లు పడలేదు. వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నా.. కాబట్టి నాకు వ్యక్తిత్వ పాఠాలు చెప్పొద్దు. నాది మీ కంటే మంచి క్యారెక్టర్‌’’ అంటూ రాందేవ్‌పై విమర్శలు చేశారు.

ఎక్కడ మొదలైంది?
ఇటీవల నీట్‌ పరీక్ష వివాదంపై ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలపై కంగనా స్పందించారు. కొందరు యువత ప్రవర్తనను విమర్శిస్తూ వారిని ‘జనరేషన్‌ గట్టర్‌’ అంటూ అభివర్ణించారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, తల్లిదండ్రులపై ఆధారపడుతూ వ్యవస్థకు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు.

కంగనా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధి సౌరవ్‌ దాస్‌తోనూ ఆమెకు మాటల యుద్ధం నడిచింది. అయితే వ్యవహారం మరింత ముదరడంతో ఆమె వివరణ ఇస్తూ.. మొత్తం జెన్‌జీ యువతను ఉద్దేశించి మాట్లాడలేదని, కొందరి ప్రవర్తనను మాత్రమే విమర్శించానని తెలిపారు.

కంగనాపై రాందేవ్‌ విమర్శలు
ఈ వివాదంపై స్పందించిన బాబా రాందేవ్‌(60).. కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘యువతను ‘జనరేషన్‌ గట్టర్‌’ అనడం కలుషిత ఆలోచనకు నిదర్శనం’’ అని వ్యాఖ్యానించారు. ఆమె బాల్యం, యవ్వనం, గత విజయాల గురించి ప్రశ్నిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దీంతో రాందేవ్‌ వ్యాఖ్యలకు స్పందించిన కంగనా.. ఆయన గతంలో పతంజలి సంస్థకు సంబంధించిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని ప్రస్తావించారు.

పతంజలి కేసులో..
2024లో పతంజలి సంస్థ వ్యాధులను నయం చేస్తామని ప్రచారం చేసిన ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బాబా రాందేవ్‌, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం రాందేవ్‌ కోర్టుకు బేషరతు క్షమాపణలు తెలిపారు.

ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. తనపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని కంగనా సూచించారు. దీంతో కంగనా–రాందేవ్‌ మధ్య మాటల యుద్ధం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement