విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..! | annapurni subramaniam wins cospar vikram sarabhai medal | Sakshi
Sakshi News home page

విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!

Aug 20 2026 5:09 PM | Updated on Aug 20 2026 5:13 PM

annapurni subramaniam wins cospar vikram sarabhai medal

భారత మహిళ శాస్తవేత్త అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ అత్యున్నత ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణియం చరిత్ర సృష్టించింది. ఆమె 2026 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలలో కాస్పార్(COSPAR) విక్రమ్ సారాభాయ్ పతకంను గెలుచుకున్నారు. 

ఇటీవల ఆగస్టులో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జరిగిన 46వ కాస్పార్ సైంటిఫిక్ అసెంబ్లీలో ఈ అవార్డును గెలుచుకున్నారు అన్నపూర్ణి. నిజానికి ఆమె వ్యక్తిగత శాస్త్రీయ విజయం  భారత అంతరిక్ష ఖగోళ శాస్త్రానికి ఒక మైలురాయిగా నిలవడం విశేషం. అంతేగాదు ఈ పతకాన్ని అందుకున్న తొలిభారతీయ మహిళ, అలాగే ఈ పతకాన్ని గెలుకున్న వారిలో నాల్గో భారతీయురాలిగా ఘనత సాధించారామె. 

ఈ పతకాన్ని ఆమె కంటే ముందు 1996లో యు.ఆర్. రావు: ఇస్రో మాజీ ఛైర్మన్, 2014లో గుర్బక్స్ సింగ్ లఖినా: అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త, 2024లో అనిల్ భరద్వాజ్: ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ డైరెక్టర్ తదితరలు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

ఈ పురస్కారం విశిష్టత..
అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి 1958లో కాస్పార్ విక్రమ్ సారాభాయ్ పతకాన్ని స్థాపించారు. విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం, అంతరిక్ష పరిశోధన కమిటీ (COSPAR), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తాయి. 

ఆయన భారతదేశ అంతరిక్ష కార్యక్రమ రూపశిల్పులలో ఒకరు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంతరిక్ష పరిశోధనకు చేసిన విశేష కృషిని గుర్తించి, ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. అభ్యర్థులు ఏ దేశానికి చెందినవారైనా కావచ్చు, అయితే పురస్కార ప్రదానోత్సవానికి ముందు ఐదేళ్ల కాలంలో సంబంధిత కృషిని ఆధారంగా చేసుకుని ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

ఇక అన్నపూర్ణి మూడు దశాబ్దాలకు పైగా ఈ రంగంలోనే కొనసాగారామె.  అంతేగాదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం.. ఆమె సుమారు 175 పరిశోధనా పత్రాలను ప్రచురించడమే గాక 15 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. అలాగే మాగెల్లానిక్ క్లౌడ్స్‌తో పాటు నక్షత్ర సమూహాలు, నక్షత్ర జనాభా, గెలాక్సీలు, అతినీలలోహిత ఖగోళశాస్త్రం వంటి రంగాలలో పనిచేశారు.

అంతేకాకుండా, 2019లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఘనత సాధించారు. భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక బహుళ-తరంగదైర్ఘ్య అంతరిక్ష వేధశాల అయిన ఆస్ట్రోశాట్‌తో ఆమె చేసిన కృషి, ఆమె అందించిన అత్యంత ముఖ్యమైన సహకారాలలో ఒకటి. సుబ్రమణియం ఆస్ట్రోశాట్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (UVIT)కు క్యాలిబ్రేషన్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఆమె దాని కక్ష్యలోని క్యాలిబ్రేషన్, పనితీరు ధృవీకరణకు నాయకత్వం వహించారు.

భూమి వాతావరణం కారణంగా ఇక్కడ నుంచి గమనించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉండే అతినీలలోహిత తరంగదైర్ఘ్యాలలో ఖగోళ వస్తువులను అధ్యయనం చేయడానికి ఈ టెలిస్కోప్ ఖగోళ శాస్త్రవేత్తలకు వీలు కల్పించింది.

భవిష్యత్ టెలిస్కోపుల నిర్మాణం
ఆస్ట్రోశాట్ UVIT నుంచి పొందిన అనుభవం ఆధారంగా తదుపరి తరం అతినీలలోహిత-ఆప్టికల్ స్పేస్ టెలిస్కోప్ అయిన INSISTకు సుబ్రమణియం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ఉన్నారు. అంతర్జాతీయ థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్ట్‌లో భారతదేశం పాల్గొనడానికి కూడా ఆమె తోడ్పడ్డారు. అంతేగాదు ఆమె అందించిన ఈ సేవలకు గానూ భారత ప్రభుత్వం 2024లో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ – విజ్ఞాన్ శ్రీతో సత్కరించింది.

(చదవండి: మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement