విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్‌ మ్యారేజ్‌ ప్లాన్‌? | Govinda-Sunita Divorce Row Takes Fresh Turn, Secret Wedding Claims With Co-Star Spark Buzz, Read Story Inside | Sakshi
Sakshi News home page

విడాకులు వెనక్కి.. అయినా సీక్రెట్‌ మ్యారేజ్‌ ప్లాన్‌?

Aug 21 2026 10:55 AM | Updated on Aug 21 2026 11:11 AM

Divorce U Turn Secret Wedding Buzz: Govinda Sunita Row Takes New Twist

బాలీవుడ్‌ నటుడు గోవింద, ఆయన భార్య సునీత అహుజా మధ్య వివాహ వివాదం మరో మలుపు తిరిగింది. 2024లో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఇటీవలే సునీత వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.  అయితే తన సహనటి కోమల్‌ రాణి స్వర్ణకర్‌ను రహస్యంగా వివాహం చేసుకోబోతున్నారంటూ ఓ వార్త బాంబ్‌లా పేలింది. ఈ బాంబ్‌ పేల్చింది ఎవరో కాదు.. గోవింద సతీమణి సునీతనే!.

ముంబైలో నటి రాఖీ సావంత్‌ మీడియాతో మాట్లాడుతున్న గోవిందా భార్య సునీతతో ఫోన్‌ కలిపారు. ఈ సంభాషణలో తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శల గురించి సునీత ప్రస్తావించారు. ఇదే సమయంలో గోవింద, కోమల్‌ రాణి పెళ్లి చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకున్నారని ఆమె చెప్పారు. “నేను నిన్నే విడాకుల కేసును వెనక్కి తీసుకున్నాను. అయితే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు” అని సునీత వ్యాఖ్యానించించారు. అదే సమయంలో కోమల్‌ రాణిని సునీత ‘చికెన్‌ టిక్కా’ అంటూ సంబోధించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

సునీతకు రాఖీ సలహా
ఈ సందర్భంగా రాఖీ సావంత్‌ సునీతకు మద్దతుగా మాట్లాడారు. గోవిందకు సంబంధించినట్లు చెబుతున్న రూ.200 కోట్ల ఆస్తిపై దృష్టి పెట్టాలని, ఇతర విషయాలను పక్కన పెట్టి ఆస్తులను తన పేరుపై భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు సునీత స్పందించగా.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గోవింద, కోమల్‌ పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని బాంబ్‌ పేల్చారు.

కింగ్‌ ఆఫ్‌ కామెడీగా..
బాలీవుడ్‌ నటుడు గోవిందా 90వ దశకంలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌, ప్రత్యేకమైన డ్యాన్స్‌ స్టైల్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కూలీ నంబర్‌ 1’, ‘హీరో నంబర్‌ 1’, ‘రాజా బాబు’, ‘దుల్హే రాజా’ వంటి హిందీ చిత్రాల రీమేక్‌ వెర్షన్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడు. 1963 డిసెంబర్‌ 21న జన్మించిన ఆయన అసలు పేరు గోవింద్‌ అరుణ్‌ అహూజా. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్లు. గోవిందా, సునీతా అహూజాలను 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమార్తె టీనా అహూజా, కుమారుడు యశ్‌వర్ధన్‌ అహూజా. 90లలో ‘కింగ్‌ ఆఫ్‌ కామెడీ’గా గుర్తింపు పొందిన గోవిందా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగానే కొనసాగుతున్నారు.

ఎయిర్‌పోర్టులో కనిపించిన తర్వాతే..
గోవింద, కోమల్‌ రాణి మధ్య సంబంధంపై ఇటీవలే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు బయటకు రావడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ఆ తర్వాత సునీత.. గోవింద, కోమల్‌ మధ్య సంబంధంపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. కూతురి వయసున్న అమ్మాయితో ఎఫైర్‌ నడుపుతున్నాడని..  కోమల్‌ను గోవిందకు ‘షుగర్‌ డాడీ’ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

కోమల్‌ రాణి స్వర్ణకర్‌ ఎవరంటే.. 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోమల్‌ వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రాలేదు. అయితే ఆమె బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న నటి. గోవిందా నటిస్తున్న రూపా చిత్రంలో ఆమె హీరోయిన్‌. అలాగే ఆయన నటిస్తున్న మరో ప్రాజెక్టు దునియాదారిలోనూ నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవల గోవిందాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో వీరిద్దరి మధ్య సంబంధంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే గోవిందా గానీ, కోమల్‌ గానీ తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని అధికారికంగా ధృవీకరించలేదు.

సునీతకు గోవింద కౌంటర్‌
మరోవైపు సునీత చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలపై గోవింద కూడా స్పందించారు. సునీత తనను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని ఆపాలని ఆయన కోరారు. యువత ఆమెను ఆదర్శంగా చూస్తుందని, అందువల్ల బహిరంగంగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. తల్లులు, అక్కాచెల్లెళ్ల పేర్లను అసభ్యంగా ఉపయోగించడం సరికాదని.. ఆమె నుంచి అలాంటి ప్రవర్తనను తాను ఆశించలేదని గోవింద వ్యాఖ్యానించారు.

మొన్నే విడాకుల పిటిషన్‌ వెనక్కి
గోవింద, సునీత దంపతుల వివాహ బంధంపై కొంతకాలంగా వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. సునీత 2024లో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే మొన్నీమధ్యే ఆగస్టు 19న దాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వివాహ బంధం కొనసాగుతుందనే సంకేతాలు కనిపించాయి.

కానీ పిటిషన్‌ ఉపసంహరణ జరిగిన వెంటనే సునీత చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి గోవింద వ్యక్తిగత జీవితంపై చర్చకు దారితీశాయి. మరోవైపు నటి పూనమ్‌ పాండే, సోమీ అలీ కూడా ఈ వివాదంలో గోవిందకు మద్దతుగా మాట్లాడారు. ప్రస్తుతం గోవింద–సునీత మధ్యలో కోమల్‌ రాణి పేరు తెరపైకి రావడంతో బాలీవుడ్‌లో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement