ఇది కూటమి సర్కారువారి డైవర్షన్‌ డ్రామా! | YS Avinash Reddy ED Raids, YSRCP Calls Viveka Case Probe A Political Diversion Drama, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇది కూటమి సర్కారువారి డైవర్షన్‌ డ్రామా!

Aug 21 2026 10:31 AM | Updated on Aug 21 2026 11:18 AM

ED Raids in Viveka Case: A New Diversion Drama From CBN

సాక్షి, గుంటూరు: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించడం ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ఇన్నాళ్లుగా సీబీఐ విచారణలో కనిపించని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇప్పుడు పీఎంఎల్‌ఏ పేరిట హఠాత్తుగా రంగంలోకి రావడంపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ సోదాలు కూటమి ప్రభుత్వం వారి కొత్త డైవర్షన్‌ డ్రామా అంటూ మండిపడుతోంది.

వివేకా హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లో రెండు, కడప జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో.. మొత్తం పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతో పాటు ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఈ కేసులో హవాలా మనీ కోణం తెరపైకి రావడం పలు అనుమాలకు తావిస్తోంది.

ఇంతకాలం ఈడీ ఎక్కడ?
2019 మార్చి 15న పులివెందులలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం కేసు సీబీఐకి వెళ్లింది. సీబీఐ 2020 నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ చార్జ్‌షీట్లు, అనుబంధ చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. తాజాగా మూడో అనుబంధ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన అనంతరం.. ఇకపై మరింత దర్యాప్తు అవసరం లేదని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తిచేసినట్లు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆ దశలో తదుపరి దర్యాప్తుపై జోక్యం చేసుకోలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా ప్రశ్నలకు తావిస్తోంది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని చెబుతున్న సమయంలో.. కొత్తగా ఈడీ ఎందుకు రంగంలోకి వచ్చింది? ఇంతకాలం ఈడీ పేరు ఎక్కడా లేకుండా ఇప్పుడు హఠాత్తుగా సోదాలు ఎందుకు? అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తోంది.

డీఎస్సీ వివాదం.. అవినీతి ఆరోపణల వేడి
ఇదే సమయంలో.. ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ వ్యవహారం సహా పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటోంది. డీఎస్సీలో అవకతవకలు జరగడం.. అసెంబ్లీ సమావేశాల్లో వాటిని పరోక్షంగా ఒప్పుకోవడం.. మండలిలో చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టుబట్టడం.. భయపడి కూటమి ప్రభుత్వం పారిపోవడం తెలిసిందే. అటు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ కుంభకోణాన్ని బయటపెట్టి.. చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ను ఏకీపారేశారు. 2018 గ్రూప్‌-1  విషయంలో తాము సీబీఐ విచారణకు సిద్ధమని, డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వివేకా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘డైవర్షన్‌ డ్రామా’నే
ఈడీ సోదాల వెనుక కేంద్ర దర్యాప్తు అవసరం కంటే రాజకీయ ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోందనే చర్చ నడుస్తోంది. వ్యవస్థలను మేనేజ్‌ చేసే చంద్రబాబు దీని వెనుక ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.‘‘కూటమి ప్రభుత్వ తప్పులను, అవినీతి ఆరోపణలను, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఏదో ఒక డైవర్షన్‌ డ్రామాకు దిగుతుంది. గత రెండేళ్లలో ఏపీలో జరుగుతోంది ఇదే. ఇప్పుడు కూడా ఇంతే’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. మొత్తానికి వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసినట్లు చెబుతున్న వేళ.. అదే కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో మరో హైడ్రామాకు తెరలేపినట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement